లెజండరీ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు, మరో లెజండరీ నృత్యకారుడు, మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదిక మీద ఉంటే ఎలా ఉండేదో కదా. ఈ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. వీరు జుగల్బందీ చేస్తే చూసి తరించాలని కలలు కనేవారు కూడా చాలామంది ఉంటారు. అలాంటి అవకాశం త్వరలోనే వస్తుందనుకుంటున్న తరుణంలో శోభానాయుడు కనుమరుగయ్యారు. వారిద్దరూ ఒకే వేదిక మీదకు ఎలా వస్తారా అన్నదే మీ సందేహం కదా. అలా కలవాలన్నది శోభానాయుడు కల.. ఆ కల నెరవేరబోయే తరుణంలో ఇలా జరిగింది. యావత్ ప్రపంచాన్నికరోనా వణికిొస్తున్న సమయంలో శోభానాయుడు ఓ నృత్య గేయంతో కరోనా గురించి భయపడవద్దని ప్రజలను చైతన్యపరిచిన సంగతి తెలిసిందే.
వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతిని కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి శోభానాయుడు అంటే చిరుకు కూడా ఎంతో అభిమానం. ఆమెతో చిరంజీవికి వ్యక్తి గతంగానూ ఎంతో పరిచయం ఉంది. అయితే చిరంజీవిని తను చేపట్టే కార్యక్రమానికి ఆహ్వానించడానికి శోభానాయుడుకు మొహమాటం అడ్డొచ్చింది. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు కోటికి చెబితే కోటి ఆమె కోరికను చిరంజీవికి తెలిపారు. తను అభిమానించే కళాకారిణి తనను అభిమానిస్తోందంటే తన జన్మ ధన్యమైందన్న భావన కలుగుతోందని చిరు కోటితో అన్నారట.
‘శోభానాయుడు నేను అత్యంత అభిమానించే కళాకారిణి. ఈ వయసులో కూడా కరోనా సమయంలో ఇంట్రస్టు చూపించి నర్తించి మెప్పించారంటే గనుక శభాష్ నాకు చాలా సంతోషంగా ఉంది. వీలైతే వారికి నా అభినందనలు తెలియజేయండి. మరీ కుదిరితే వారి నంబర్ నాకు ఇవ్వండి నేను వీలు చూసుకుని ఫోన్ చేస్తాను.’ అని చిరంజీవి కోటితో అన్నారట. ఈ విషయాన్ని కోటి కూడా ఆమెకు తెలియజేశారు. దాంతో ఆమె చిరంజీవిగారి నంబర్ కు ఓ వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. ‘మెగాస్టార్ చిరంజీవిగారికి.. మీ అభిమానుల మనుసుల్లో శాశ్వతంగా హీరోగా నిలిచిపోయిన మా చిరుగారికి అనేక వందనాలు. కోటి గారితో మీరు నా గురించి ప్రస్తావించిన అంశాలు విని చిన్న పిల్లలా ఎగిరి గంతేశాను. మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. గాలిలో తేలిపోయింది. మీమీద నాకున్న అభిమానం మాటల్లో చెప్పలేను.
ఒకవిధంగా చెప్పాలంటే అది మాటలకందని ఆరాధన. నవరసాలను మీ కళ్లలో పలికించి చిటికెలో పండించి మా మనసుల్ని గెలిచిన మహారాజు మీరు. ఈ గడ్డుకాలం అయిపోయాక మేం చేయబోయే మొదటి ప్రదర్శనకు మీరు, కోటి గారు అతిథులుగా రావాలి. మీకు ఫోన్ చేద్దామని చాలా సార్లు ప్రయత్నించాను. ఎంత బిజీగా ఉన్నారో అర్థమైంది. మీ జవాబు నాకు వినిపించి ఫరవాలేదు మాట్లాడండి అన్న ధైర్యాన్ని నాలో నింపిన కోటిగారికి అనేక అనేక కృతజ్తతలు.’ అంటూ శోభానాయుడు అందులో పేర్కొన్నారు. కళాకారిణిగా ఆమెకు కళల పట్ల, సమాజం పట్ల ఉన్న అభిమానం ఎంతో తనకు అర్థమైందని చిరంజీవి అన్నారు. ఇలాంటి కళాకారిణి ఈరోజు మనముందు లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.