విచిత్రమైన విషయం ఏమంటే.. ఆంధ్రాలో నేతలు తెలివైనోళ్లు.. తెలంగాణలో ఓటర్లు తెలివైనోళ్లు. ఈ కారణంతోనే ఆంధ్రాలో నేతలు ఓటర్లను ఆడిస్తారు. తెలంగాణలో ఓటర్లు నేతల్ని చెడుగుడు ఆడుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉండే తెలంగాణ ఓటర్లు.. ఇప్పటికి తమలో చేవ తగ్గలేదన్న విషయాన్ని దుబ్బాక ఉప ఎన్నికలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
ఇదే దుబ్బాక లాంటి ఎన్నిక ఏపీలో జరిగి ఉంటే.. కులాల మధ్య చిన్నసైజు కురుక్షేత్ర యుద్ధంగా మారటమే కాదు.. ఇష్యూ అంతా కులాల మీదనే ఫోకస్ అయ్యేది. కానీ.. తెలంగాణలో కులాల ముచ్చట పెద్దగా ప్రస్తావనకు రాదు. కొంతమంది కావాలని కెలికే ప్రయత్నం చేసినా.. తెలంగాణ ప్రజలు ఆ విషయానికి అట్టే ప్రాధాన్యం ఇవ్వరు.
అంతేకాదు.. నెత్తిన పెట్టుకున్నోళ్లను.. తేడా వస్తే నేలకు ఈడ్చి కొట్టే గుణం తెలంగాణ వారికి ఉంటుంది. తమ క్షేమాన్ని కాంక్షించని నేతల్ని.. పార్టీల్ని భరించేందుకు వారు అస్సలు ఇష్టపడరు. అంతే కాదు.. సెంటిమెంట్ డైలాగుల్ని అస్సలు భరించలేరు. భావోద్వేగ రాజకీయాలకు కొంత వంగినట్లు కనిపించినా.. తరచూ అదే కార్డు ప్రయోగిస్తే.. బిడ్డా.. మాతోనే ఆటలా? అంటూ కన్నెర్ర చేసి.. ఇలాంటివి చేస్తే ఇంక అంతే సంగతులు అన్న విషయాన్ని ఓటుతో చెప్పేస్తుంటారు.
సాధారణంగా డబ్బుతో ఏమైనా చేయొచ్చన్న థియరీ కొందరిలో కనిపిస్తుంటుంది. ఎన్నికల వేళ.. ఆంధ్రాలో డబ్బు ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ.. తెలంగాణలో అందుకు భిన్నం. వాస్తవాల్ని కాస్త ఓపెన్ గా మాట్లాడుకుంటే.. దుబ్బాక ఉప ఎన్నికల వేళ.. అధికార టీఆర్ఎస్ పార్టీ చివరి మూడురోజుల్లో ఎంతో భారీగా ఖర్చు చేసిందని సర్వత్రా వినిపించింది.
ఆ మాటకు వస్తే.. ఓట్లకు డబ్బు పంపిణీలో టీఆర్ఎస్ ముందు బీజేపీ వెలవెలపోయిందన్న మాట బలంగా వినిపించింది. ఈ కారణంతోనే.. దుబ్బాక తుది ఫలితం ఏమిటన్న మాట చెప్పాల్సి వస్తే.. మొగ్గు గులాబీ బ్యాచ్ వైపే చూపటం కనిపిస్తుంది. అయితే.. తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూసినప్పుడు అర్థమయ్యేదేమంటే.. పైసలతో తమను కొనలేరన్న విషయాన్ని దుబ్బాక ఓటర్లు చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
అంతేకాదు.. ఒట్టు వేస్తే ఇంత.. ఒట్టు వేయకుంటే ఇంత అంటూ విచిత్రమైన ప్రతిపాదనతో డబ్బులు పంచిన పార్టీ.. తాము పంచిన డబ్బుల లెక్క ద్వారా తమకొచ్చే ఓట్లను లెక్క వేసుకొని గెలవటం ఖాయమని చంకలు గుద్దుకున్నారని.. ఒట్టు పేరుతో తమతో ఆడే ఎమోషనల్ డ్రామాకు.. దిమ్మ తిరిగేలా దుబ్బాక ప్రజలు సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఆంధ్రాలో అయితే.. ఫలితం మరోలా ఉండేదని చెప్పక తప్పదు. ఇప్పుడు అర్థమైందా? తెలంగాణ ఓటర్లకు.. ఆంధ్రాఓటర్లకు మధ్యనున్న వ్యత్యాసం.