(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అధికార పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాలలకు పెద్దదిక్కుగా తన గురించి తానే భావిస్తూ ఉండే ఒక సీనియర్ నాయకుడికి, ఓ మంత్రి గారికి మధ్య పొరపొచ్చాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కొంత కాలంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాకను వ్యతిరేకించే వ్యవహారంలోనూ ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.
తర్వాతి కాలంలో అది సమసిపోయినట్టు వారు బయటకు కనిపించినా లోలోన అగ్గి రాజుకుంటూనే ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఓ మహిళ విషయంలోనూ వీరిరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగిందని ప్రచారంలోకి వచ్చింది. సహజంగానే దానిని ఖండించిన.. ఇరువురు నేతలు అలా ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు.
ఆయన్ని వెళ్లి అడగండి…
తాజాగా ఆ మంత్రి నోటి వెంట ‘ఆయన్ను వెళ్లి అడగండి అయ్యా’ అన్న ఈ వ్యాఖ్యను బట్టి ఇరువురి మధ్య ఇంకా విభేదాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. విషయం ఏంటంటే… కొందరు వ్యక్తులు ఆ మంత్రి గారి వద్దకు సిఫార్సుల కోసం మంగళవారం వెళ్లగా… ’మీరేమో ఆ పని చేయండి ఈ పని చేయండి నా వద్దకు వస్తారు. నేనేదో మీ దగ్గర తినేస్తున్నట్టు ఆయన అనుకుంటున్నాడు… మీకేం కావాలో ఆయనే వెళ్లి అడగండి.. వెళ్లి ఆయన మీద ఎక్కండి‘ అని మంత్రిగారు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారందరికీ ఏం చేయాలో పాలుపోక నిరాశగా వెనుదిరిగారు.
చూడబోతే మంత్రి గారి దందాల గురించి.. సదరు సీనియర్ నాయకుడు.. ఓ కన్నేసి ఉంచారని అర్థమవుతోంది. వాటిని పైకి చేరవేస్తున్నారని కూడా అనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఠాలుగా ముదిరిన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో- ఒకవైపు రోడ్డున పడి కొట్టుకుంటూ ఉంటే.. మరోవైపు ఇలా లోలోపల ఒకరి మీద ఒకరు అక్కసు పెంచుకుంటున్న నాయకులు సూటిపోటి మాటలు అనుకుంటూ ప్రజల ఎదుట పలచన అవుతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.