జో బైడెన్ నిన్నటి వరకూ అమెరికాలో తప్ప ఎవరికీ పెద్దగా తెలియని పేరు. అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో జోబైడెన్ అగ్రరాజ్య అధ్యక్షుడుగా విజయకేతనం ఎగురవేయడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు ప్రపంచ దేశాలకు తెarసి వచ్చాయి. డెమొక్రటిక్ పార్టీ నుంచి విజయకేతనం ఎగురవేసిన జో బైడెన్ జీవితం నల్లేరుపై నడక కాదని ఆయన చరిత్ర పరిశీలిస్తే అర్థం అవుతుంది. 1942 నవంబరు 20న పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్ లో జన్మించిన జో బైడెన్ మొదటి నుంచి రాజకీయాలకే జీవితం అంకితం చేశారు. జో బైడెన్ 1972లో అంటే 30 ఏళ్ల వయసులోనే దెలవారె నుంచి సెనెటర్‌గా మొదటిసారి గెలిచారు. అంటే ఇప్పటికి జో బైడెన్ దాదాపు ఐదు దశాబ్ధాల రాజకీయ జీవితం గడిపారు. అమెరికా రాజకీయాలపై మంచి పట్టున్న జో బైడెన్, గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఒంటి చేత్తో డెమొక్రటిక్ అభ్యర్థులను గెలిపించి అధ్యక్షపీఠాన్ని ఎక్కబోతున్నారు.
చీకట్లు నింపిన కారు ప్రమాదం
కష్టాలకు ఎదిరీదిన నేతగా జో బైడెన్‌ను చెప్పుకుంటారు. 1966లో నీలియా హుంటర్‌ను వివాహ మాడిన జోబైడెన్ జీవితంలో కారు ప్రమాదం చీకట్లను నింపింది. కారు ప్రమాదంలో జో బైడెన్ భార్య, కుమార్తె అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ప్రమాదం ఆయన్ను కుంగదీసిందనే చెప్పాలి. తరవాత పదకొండేళ్లకు జో బైడెన్ జాకోబ్స్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమార్తె జన్మించారు.
ఎనిమిది సంవత్సరాల పాటు ఉపాధ్యక్షునిగా..
2008లోనే మొదటి సారిగా జో బైడెన్ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగారు. అయినా ఆయనను ఒబామా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ కోల్పోయారని చెప్పవచ్చు. 2009 నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షునిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పటి అధ్యక్షులకు బాగా కలసి వచ్చాయంటారు. 2015లో జో బైడెన్ పెద్ద కుమారుడు బ్రెయిన్ క్యాన్సర్ తో చనిపోయారు. 2016లో కొందరి ప్రసంగాలను జో బైడెన్ కాపీ చేశారనే ఆరోపణలు రావడంతో మరోసారి అమెరికా అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చివరగా అంటే ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగి, అమెరికా అధ్యక్ష పదవికి కావాల్సిన మెజారిటీ సాధించారు. త్వరలో అమెరికాకు జో బైడెన్ 46వ అధ్యక్షుడు కాబోతున్నారు.
పట్టువదలని విక్రమార్కుడు
ఆయన గురించి తెలిసిన వారు జో బైడెన్ పట్టువదలని విక్రమార్కుడు అంటారు. ఎన్నిసార్లు ఓడిపోయినా మరోసారి ప్రయత్నం చేయడమే ఆయన విజయ రహస్యంగా చెప్పుకోవచ్చు. 77సంవత్సరాల వయసులో ఎవరైనా నాకెందుకు ఈ రాజకీయాలు అనుకుంటారు… జోబైడెన్ మాత్రం అమెరికా అధ్యక్షుడు కావాలన్న కల నెరవేర్చుకునేందుకు అహర్నిశలూ శ్రమించారు. చివరకు విజయకేతనం ఎగుర వేశారు. అమెరికా ఎన్నికల ఫలితాల తరవాత జో బైడెన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలో రెడ్ స్టేట్స్ అంటే రిపబ్లికన్లు గెలిచిన రాష్ట్రాలు, గ్రీన్ స్టేట్స్ అంటే డెమొక్రట్లు గెలిచిన రాష్టాలను వేరుగా చూడనని, ఇక నుంచి అంతా యునైటెడ్ స్టేట్స్ అని ఆయన చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. తనకు ఓట్లు వేసిన వారి కోసం ఎంతగా శ్రమిస్తానో, తనకు ఓట్లు వేయని వారి కోసం కూడా అంతే శ్రమిస్తానని జో బైడెన్ చెప్పిన మాటలు నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.











