రాష్ట్ర బీజేపీలో కోర్ కమిటీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.. కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కమిటీ మొదలుకొని జిల్లా మండల కమిటీలు ఆచరణలో పెడతాయి. డా.లక్ష్మణ్ అధ్యక్షుడు గా ఉన్న సమయంలో కేవలం ఐదుగురు నేతలు మాత్రమే కమిటీలో సభ్యులుగా ఉండే వారు. అప్పటి అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు, మురళీధర్ రావు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్ ఉండే వారు.
వీరితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆహ్వానిత సభ్యులుగా ఉండే వారు. పార్టీ పాలసీ నిర్ణయాలు కానీ, పార్టీ బలోపేతానికి, ఏదైనా అంశంపై కార్యాచరణ తీసుకోవాలి అన్నా కోర్ కమిటీ సమావేశం తప్పనిసరిగా జరిగేది. పార్టీ జాతీయ స్థాయి నేతలు ఎవరైనా వచ్చిన కోర్ కమిటీ తోనే సమావేశాలు నిర్వహించి వెళ్లేవారు.
ఐదుగురితో మొదలైన ఈ కమిటీలో రానురాను 23 మందిని సభ్యులుగా తీసుకున్నారు. రాష్ట్రం లో మారిన బీజేపీ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల నుండి వచ్చిన మాజీ మంత్రులకు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లకు కోర్ కమిటీలో చోటు కల్పించారు అట. తమను కాదు అని ఇతర పార్టీలో నుండి వచ్చిన వారిని కీలక నిర్ణయాధికారం గల కోర్ కమిటీలో చోటు కల్పించడం ఏంటి అంటూ నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో లక్ష్మణ్‌ను నిలదీసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అప్పట్లో అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా కోర్ కమిటీని చూసి ఆశ్చర్యపోయారుట. కోర్ కమిటీ సభ్యులు ఇక చాలు ఇంకా ఎవరినీ తీసుకోకండి అని కూడా చెప్పారట. అయితే అలాంటి కీలకమైన కోర్ కమిటీ ఇప్పుడు మనుగడలో ఉందా, లేదా అనేదానిపై పార్టీలో చర్చ నడుస్తోంది.
ఇప్పటికీ కొంతమంది నేతలు కోర్ కమిటీ సభ్యులం అని చెప్పుకుంటుండగా మరికొంత నేతలు మాత్రం కోర్ కమిటీ రద్దు అయినది అంటున్నారు. రాష్ట్ర కమిటీ రద్దు అయిన మరుక్షణమే డిఫాల్ట్ గా కోర్ కమిటీ సైతం రద్దు అవుతుంది అంటున్నారు. కోర్ కమిటే ఉంటే గత ఎనిమిది నెలలుగా ఒక్కసారి కూడా ఎందుకు సమావేశం కాలేదు అనిప్రశ్నిస్తున్నారు. కోర్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం చేసుకోక పోవడం అధ్యక్షుడు విచక్షణ మేరకు ఉంటుంది అంటున్నారు.
కోర్ కమిటీ రద్దు అయినా ఇంకా కోర్ కమిటీ సభ్యుడినే అని చెప్పుకోవడాన్ని తప్పు పడుతున్నారు కొందరు కమలనాథులు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం వారిని చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారు అంటున్నారు. గతంలో కోర్ కమిటీలో స్థానం దక్కని నేతలు- ఇప్పుడు కోర్ కమిటీలో స్థానం కోసం శ్రమిస్తున్నారు. ఇందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్ర కార్యవర్గం ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. సీనియర్లకు ఇటు రాష్ట్ర కమిటీలోనూ , అటు జాతీయ కమిటీలోను స్థానాలు దక్కలేదు. దీంతో వారు పార్టీ ఏ పదవి ఇస్తుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కోర్ కమిటీ ఏర్పాటు చేసి అందులో కూడా వారికి చోటు దక్కక పోతే ఇబ్బందికరంగా ఫీల్ అవుతారని భావిస్తున్న ఆ పార్టీ అధిష్టానం.. ముందుగా రాష్ట్రంలో పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటుచేసిన తరువాతే కోర్ కమిటీపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.











