నేతల స్వరం రోజురోజుకి మారుతుండటంతో బీజేపీ, జనసేన పొత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేత డీకే అరుణ ఒక టీవీ డిబేట్‌లో మాట్లాడుతుండగా, బీజేపీకి టిఆర్ఎస్‌కు లోపాయికారి ఒప్పందం ఉందా అన్న ప్రశ్న ఎదురయింది. ఇటీవల కేసిఆర్ ప్రధానిని కలిసిన తర్వాత కాంగ్రెస్ వైపు నుండి ఇటువంటి విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిపై స్పందించిన డీకే అరుణ, టిఆర్ఎస్‌తో తమకు ఎటువంటి పొత్తు లేదని, టిఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు ఆకర్షించబడకుండా టిఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్‌లో భాగంగా ఇటువంటి రూమర్స్ వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్‌తో తమకు ఏ స్థాయిలో ఎప్పుడూ పొత్తు లేదని ఆవిడ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో పొత్తే లేదా..
ఇదే సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు 10 రోజుల పాటు అన్నం తినలేదని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ పార్టీతో బీజేపీకి తెలంగాణలో పొత్తు ఉందా అని యాంకర్ ప్రశ్నించగా, దానికి డీకే అరుణ సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ కేవలం మోడీ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై జాతీయ స్థాయిలో మోడీ ద్వారా పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రాంతీయ స్థాయిలో తమకు జనసేనతో ఎటువంటి సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫు నుండి జనసేనకు సీట్లు కేటాయిస్తారా అని యాంకర్ తిరిగి ప్రశ్నించగా, అసలు జనసేనతో తమకు పొత్తు లేనప్పుడు సీట్ల కేటాయింపు అనే ప్రస్తావన ఎందుకు వస్తుందని ఆవిడ వ్యాఖ్యానించారు. మొత్తానికి జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలనే ప్రస్తుతం డీకే అరుణ పునరుక్తి చేసినట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే రాబోయే తెలంగాణ ఉప ఎన్నికలలో బీజేపీతో పాటు జనసేన కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. అలా జనసేన బరిలో నిలబడితే జనసేన అభ్యర్థి గెలవలేకపోయినప్పటికీ బీజేపీ అభ్యర్థి గెలుపు అవకాశాలకు గండి పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.