భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తీసుకున్నారు. నేటి నుండి కరోనా వ్యాక్సిన్ రెండో దశ మొదలైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఈరోజు ఉదయం మోడీ కొవాక్జిన్ మొదటి డోస్ తీసుకున్నారు. కేరళకు చెందిన సిస్టర్ మోడీకి కరోనా టీకా వేయడం విశేషం. తాను కరోనా టీకా తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మోడీ. ఇక భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తమిళనాడు పర్యటనలో ఉన్నారు. దాంతో చెన్నై లోని వైద్య కళాశాలలో ఆయన కరోనా టీకా తీసుకున్నారు. తాను టీకా వేయించుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు వెంకయ్య నాయుడు.
4 గంటల్లో 10 లక్షల మంది నమోదు
కరోనా టీకా పట్ల ప్రజల్లో కొంత అపోహలు ఉన్న నేపథ్యంలో దేశ ప్రధాని , ఉప రాష్ట్రపతి ఇద్దరూ కూడా కరోనా టీకా తీసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కరోనా టీకా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా భారత ఆరోగ్య శాఖ కోరడంతో భారీ ఎత్తున స్పందన వచ్చింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం.
మంత్రి ఈటల రాజేందర్ కూడా..
దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు తమ పేర్లని నమోదు చేసుకోవడమే కాకుండా కరోనా టీకా వేయించుకోవడం విశేషం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో కరోనా టీకా వేయించుకున్నారు. మొదటి దశలో కరోనా టీకా కరోనా వారియర్స్ అయిన వైద్య, ఆరోగ్య సిబ్బందికి , పోలీసులకు వేయగా ఇప్పుడు రెండో దశ ప్రారంభమైంది. మోడీ కరోనా తీసుకోవడం మంచిదే…. నేను కూడా టీకా తీసుకుంటానని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొనడం కొసమెరుపు.











