సాధారణ ఎన్నికలంటే పార్టీలు ప్రభుత్వంలోకి ఎవరు రావాలనే సంగతి తేల్చడానికి జరుగుతుంటాయి. కానీ ఉప ఎన్నిక విషయంలో ఒక ప్రభుత్వం ఆల్రెడీ కొలువు తీరి ఉంటుంది. కేవలం ఖాళీని భర్తీ చేయడానికి మాత్రమే ఉపఎన్నిక జరుగుతుంటుంది. అలాంటి సమయంలో ప్రభుత్వంలో ఉన్న వారికి ఉపఎన్నికను ప్రభావితం చేయడానికి ఉండగల అవకాశాలు ఎక్కువ. కేవలం.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం గురించే ఈ మాట చెప్పడం లేదు. ఆ ప్రాంతంలో ప్రజలకు అలవిమాలిన వరాలు ఇచ్చి తమ పట్ల అనుకూలతను సృష్టించుకోవడం కూడా వారికి ఈజీ.
మరో కోణంలో చూస్తే.. ఉప ఎన్నిక అక్కడి ప్రతినిధి హఠాన్మరణం వలన జరుగుతుంటే గనుక.. ఇంకా ఏకపక్షంగా ఉంటుంది. సానుభూతి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి బలంగా మారి.. ఆ పార్టీనే విజయం వరిస్తుంటుంది. చాలా వరకు ఏకగ్రీవం అవుతుంటాయి. ఒకవేళ ఉపఎన్నిక జరిగినా నామమాత్రం.
ఇలాంటి నేపథ్యంలో.. దుబ్బాక ఉపఎన్నిక మాత్రం ప్రత్యేకం. ఇక్కడ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతోనే ఉపఎన్నిక వచ్చినా, అధికార పార్టీ అభ్యర్థే అయినా.. ఎన్నిక మాత్రం ఉద్రిక్తంగా మారుతోంది. బీజేపీ చాలా సీరియస్ గా తీసుకోవడంతో ఎన్నిక వాతావరణమే మారిపోయింది.
అమీతుమీ తేల్చాలనే
గత సాధారణ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ లకు ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదు. కానీ.. ఈ రెండేళ్లలో తెరాస పాలన పట్ల బాగా వ్యతిరేకత వచ్చిందనే అభిప్రాయంతో ఆ పార్టీలున్నాయి. దాన్ని నిరూపించడానికి ఈ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్నాయి. ఆ సంగతి అధికార పార్టీకి కూడా క్లారిటీ ఉంది. అందుకే సమరం హీటెక్కింది.
ధనప్రవాహం
సాధారణంగా అధికార పార్టీ, సానుభూతి ఇవన్నీ కలిసి గట్టున పడిపోతాం అనే అభిప్రాయం తెరాసలో ఉండాలి. కానీ.. సోమవారం రాత్రి పరిణమాాలు, సిద్ధిపేట హోటల్లో కూర్చుని డబ్బు సరఫరాకు ప్రణాళికల రచన, బీజేపీ చేసిన రభస వంటి ఘటనలు గానీ.. రఘునందన్ రావు బంధువుల ఇంటిలో దొరికిన సొమ్మూ రూపేణా.. ఓట్లకు డబ్బు వెదజల్లడానికి బీజేపీ కూడా వెనకాడని ధోరణి చూస్తోంటే.. రెండు పార్టీలు ఎంత సీరియస్ గా ఎన్నికను పట్టించుకుంటున్నాయో అర్థమవుతోంది. కాంగ్రెస్ చెరుకు ముత్యం రెడ్డి కొడుకును మోహరించింది గానీ.. ఒక మాటలో చెప్పాలంటే.. అక్కడితే చేతులు దులుపుకుంది.
ఇలాంటి నేపథ్యంలో మంగళవారం నాడు దుబ్బాకకు పోలింగ్ జరగనుంది. సరిగ్గా పోలింగ్‌కు కొన్ని గంటల ముందు సిద్ధిపేటలో తెరాస- బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తతల ప్రభావం.. మంగళవారం నాటి పోలింగ్ మీద కూడా పడే అవకాశం ఉంది. నియోజకవర్గం అంతటా భారీగా పోలీసుల్ని మోహరించారు. ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా చూస్తున్నారు.
పోలింగ్ శాతం పెరుగుతుందా?
సాధారణంగా ప్రతి ఉప ఎన్నికలో పోలింగ్ శాతం సాధారణ ఎన్నికలకంటె తక్కువగా నమోదు అవుతుంటుంది. కానీ ఈసారి దుబ్బాక ఉప ఎన్నికలో పోలింగ్ బాగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే కారణమని అంటున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికకు నేడే పోలింగ్
ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,98,756 మంది ఓటర్లు
ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఎన్నిక నిర్వాహణకు 5, 000 సిబ్బంది నియామకం
315 బూత్ లు ఏర్పాటు
89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల మోహరింపు.
వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
కోవిడ్ నిబంధనలతో జరగనున్న పోలింగ్,అందుకు తగ్గ ఏర్పాట్లు చేసిన అధికారులు
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇరవై మంది బరిలో ఉన్నారు.
మొత్తం 1,98,756 మంది ఓటర్లు
పురుషులు 97,978 మంది,
మహిళలు 1,00,778 మంది ఓట్లర్లు
మండల వారీగా ఓటర్లు
దుబ్బాక మండలంలో 55,208 ఓటర్లు
మిరుదొడ్డి మండలం 31,762 ఓటర్లు
తొగుట మండలం 26,751 ఓటర్లు
దౌల్తాబాద్ మండలం 23,032 ఓటర్లు
రాయపోల్ 20,513 ఓటర్లు
చేగుంట మండలం 32,829 ఓటర్లు
నార్సింగ్ మండలం 8,215 ఓటర్లు