తెలంగాణలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు మరోసారి బయట పడింది. వరదల కారణంగా నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముఖ్యమంత్రి వివిద వర్గాల నుండి సాయం కోరుతూ ప్రకటన విడుదల చేసారు. దీంతో రాష్ట్రంలో బడా వ్యాపారుల నుండి రాజకీయ నేతలతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సైతం తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇదంతా బాగుంది గానీ.. ఉద్యోగుల విషయంలో తగాదా ఏర్పడింది.
ఉద్యోగుల ఒక్కరోజు వేతనాన్ని ఫ్లడ్ రిలీఫ్ కు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కింది స్థాయి ఉద్యోగులు భగ్గుమన్నారు. రాష్ట్ర స్థాయి సంఘాల నేతలు ముఖ్యమంత్రి మెప్పుకోసం ఒక రోజు వేతనాన్ని ఇస్తామని చెబుతున్నారని .. తాము సమస్యల్లో ఉన్నామని చెబితే ఏ ఒక్కరోజైనా తమకు అండగా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలకు ఓ లేఖ సైతం విడుదల చేసారు ఉద్యోగులు. తమ జీతం నుండి ఒక రోజు వేతనాన్ని ఇచ్చేందుకు మీరెవరంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదంటున్నారు ఉద్యోగులు. అసలే కరోనాతో ఇబ్బందుల్లో ఉన్నామని.. వేతనాలు కూడా పూర్తి స్థాయిలో రాక ఇబ్బందులు పడ్డ తాము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని.. ఈ సమయంలో ఒకరోజుతు వేతనం ఇస్తామంటూ ప్రకటన చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కాలంలో, వీఆర్ఓలను ఏకపక్షంగా తీసివేస్తే ఏనాడైనా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగులు కష్టాల్లో ఉన్నప్పుడు చోద్యం చూసే ఈ సంఘాల నేతలు ఇప్పుడు ముఖ్యమంత్రి మెప్పుకోసం, తమ పనులు చక్కబెట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని చెబుతున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఉధ్యోగ సంఘాల నేతల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బలవంతంగా ఉద్యోగుల జీతాల నుండి ఒకరోజు వేతనాన్ని సంఘాల నేతలు ముఖ్యమంత్రికి అందజేశారు.
రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏం సాధించారని ఉద్యోగ సంఘాల నేతలను కింది స్థాయి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీలు, డీఏలు కూడా సాధించుకోలేక పోయామని.. సమ్మె చేసిన ఉద్యోగులను అణిచివేస్తున్నా ఏనాడు ఈ నేతలు నోరుమెదప లేదని అంటున్నారు. పీఆర్సీని కూడా సాధించలేని ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నా లేకున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదంటున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రభుత్వం నుండి ఏ ఒక్క హామీని కూడా నేరవేర్చేలా ఒత్తిడి తేలేక పోతున్నారు ఈ ఉద్యోగ సంఘం నేతలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు ఏది కోరితే అది సాధించే వరకు పోరాడే వారని .. నేడు ఆ స్పూర్తి పూర్తిగా అడుగంటి పోయి ప్రగతి భవన్ ముందు మోకరిల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఏమైనా పైరవీలు ఉంటే మరేదారైనా చూసుకుని చక్కబెట్టుకోండి కాని ఇలా అరకొర జీతాలతో బ్రతికే తమ డబ్బులను ఇలా మీకు నచ్చిన రీతిలో పంచడం ఏ మాత్రం మంచి నిర్ణయం కాదంటున్నారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే కాని ఇలా తమ జీవితాలను పణంగా పెట్టి తమ జీతాలను కట్ చేస్తూ మీరు మెప్పు పొందేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సబబు అంటున్నారు సగటు ఉద్యోగి.











