బెజవాడ కనకదుర్గగుడి ఫ్లైఓవర్. విజయవాడ ప్రజల రెండు దశాబ్ధాల కల. ఎట్టకేలకు స్వప్నం నెరవేరింది. ప్రారంభించి పట్టుమని వారం గడవక ముందే దుర్గగుడి ఫ్లైఓవర్ పై నాలుగు ప్రమాదాలు జరగడం బెజవాడ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రూ.500 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో ఆరు వరుసల్లో నిర్మించిన ఈ ఫైఓవర్ పై జరుగుతున్న ప్రమాదాల నుంచి అధికారులు పాఠాలు నేర్చుకోవడం లేదు. సహజంగా ఫ్లైఓవర్లపై వాహనాలు అతివేగంతో వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కానీ వాహనాల వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లు తగినంతగా చేసి ప్రమాదాలను నియంత్రించాల్సిన అధికారయంత్రాంగం మొద్దు నిద్ర పోతోంది.
పక్కవారి అనుభవాల నుంచి పాఠాలు నేర్వరా
ప్రతిదీ మనకే అనుభవంలోకి రావాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా చటుక్కున తెలుసుకునే సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా అధికారులు మాత్రం పాఠాలు నేర్చుకోవడం లేదు. హైదరాబాద్ నగరం బయోటెక్ పార్కు సమీపంలో ఓ భారీ ఫ్లైఓవర్ నిర్మించారు. ఫ్లైఓవర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అనేక భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రమాదానికి ప్రధాన కారణం వాహనాల అతివేగమని గుర్తించారు.
వెంటనే ఫైఓవర్ పై వాహనాలు అతివేగంగా వెళ్లకుండా నిరోధించే స్పీడ్ బ్రేకర్ స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు తగ్గాయి. హైదరాబాదు నగరంలోనూ.. అతివేగానికి దారితీసే అనేక రోడ్లపై ఇలాంటి స్పీడ్ బ్రేకర్ స్ట్రిప్‌లను ఏర్పాటుచేశారు. జాతీయ రహదారుల్లోనూ ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి.
కానీ విజయవాడ దుర్గగుడి ఫైఓవర్ పై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. అంటే ఏదొక భారీ ప్రమాదం జరిగి మీడియా గగ్గోలు పెడితే తప్ప వాహనాల వేగం నియంత్రిచే చర్యలు చేపట్టేలా కనిపించడం లేదు. కొన్ని స్పీడ్ కంట్రోల్ స్ట్రిప్ లు ఉన్నాయి కానీ.. ఇవి చాలవు.
నిజానికి ఇంత పొడవున ఫ్లైఓవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి స్పీడ్ కంట్రోల్ చేసే స్ట్రిప్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొద్దిగా మాాత్రమే ఏర్పాటుచేశారు. నిర్మాణ సమయంలోనే ఆ అవగాహన అధికార్లకు, ఇంజినీర్లకు ఉండాలి. పొరుగు రాష్ట్రంలో ప్రమాదాల వార్తలు చూసినప్పుడు, నివారణకు వారు తీసుకున్న ఏర్పాట్లను గమనించినప్పుడు ఈ జాగ్రత్తలను అలవాటు చేసుకుని ఉండాలి. మామూలుగా అధికార్లు.. ఏదైనా పని చేపట్టేముందు.. లక్షలు, కోట్లు తగలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేసి వచ్చాం అని అంటుంటారు. కానీ.. ఇంత పొడవైన కనకదుర్గ ఫ్లైఓవర్ మీద.. వేగ నియంత్రణకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం శోచనీయం.
ఫైఓవర్ పై రేసులు, స్టంటులా
దుర్గగుడి ఫ్లైఓవర్ 2.6 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసలుగా నిర్మించారు. ప్రారంభించి కొద్ది రోజులే అవుతుంది. కాబట్టి చూడాలనే కోరిక చాలా మందికి ఉండవచ్చు. దీని వల్ల ఫ్లైఓవర్ పై ప్రయాణం చేస్తూ విజువల్స్ తీయడం, ఫోటోలకు ఫోజిలివ్వడం రివాజుగా మారింది. కొందరు సోషల్ మీడియాలో ఫ్లైఓవర్ విజువల్స్ పెట్టి డబ్బు సంపాదించేందుకు కూడా షూటింగులు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇలాంటి చర్యలన్నీ ఫ్లైఓవర్‌పై ప్రమాదాలకు కారణమే. వీటికి తోడు కొందరు యువకులు ఫ్లైఓవర్ పై రేసింగులు వేస్తున్నారు. ఖరీదైన బైకులతో స్టంటులు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఫ్లైఓవర్ పై పోలీసుల గస్తీతోపాటు, నిరంతరం నిఘా ఉంచేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇవన్నీ మరచి ఫ్లైఓవర్ మేము నిర్మించామంటే మేము నిర్మించామంటూ పార్టీల నాయకులు డబ్బాలు కొట్టుకుంటున్నారు.
ఆరువరుసల ఫ్లైఓవర్‌పై కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటే దీనికి కారణం అధికారులు తీరే. రూ.500 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మించిన అధికారులు భద్రతా ఏర్పాట్లు మాత్రం మరచారు. దీంతో ఫ్లైఓవర్ పై బైకుపై ముగ్గురు ప్రయాణం చేస్తూ మరో బైకును ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పై పార్టీ చేసుకుని వెళుతుండగా తాజాగా ఈ ఘటన చోటుకుంది. ఇలాంటి ఘటనలను పరిశీలిస్తే నిరంతరం నిఘా పెట్టాల్సిన పోలీసులు కూడా అలసత్యం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది.
కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదా?
విజయవాడకే తలమానికంగా నిలిచేలా దుర్గగుడి ఫైఓవర్ నిర్మించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు కృషి చేసిన రాజకీయనాయకులు, ఇంజనీర్లను అభినందించి తీరాల్సిందే. అయితే ఫ్లైఓవర్ ఆరు లైన్లుగా నిర్మించి అప్రోచ్ రోడ్డు నాలుగు లైన్లకు కుదించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఫైఓవర్ రెండు వైపులా అప్రోచ్ రోడ్డును ఆరు లైన్లుగా విస్తరించేందుకు రూ.25 కోట్లు ఖర్చవుతుంది. దీనికి భూ సేకరణ చేయాల్సి ఉంది. రూ.500 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం రూ.25 కోట్ల నిధుల విడుదల విషయంలో మీనమీషాలు లెక్కిస్తోంది.
దీంతో కుమ్మరిపాలెం వంతెన అప్రోచ్ రోడ్డు వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా వంతెన అప్రోచ్ రోడ్డును ఆరు లైన్లకు విస్తరించాలని విజయవాడ వాసులు కోరుతున్నారు.











