ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, నాగపూర్ జైల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి. నిషేధిత మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాబాను 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ గడ్చిరౌలీ కోర్టు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద శిక్ష విధించింది. ఈ కేసులో ప్రొఫెసర్ తోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధించారు. వీరంతా నాగపూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కానీ అక్కడ జైలు సిబ్బంది రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా పట్ల వ్యవహరిస్తున్న తీరు ఖైదీల హక్కులను కాలరేసేదిగా ఉందనే విమర్శలున్నాయి.
ప్రొఫెసర్ సాయిబాబా డిమాండ్లు ఏమిటి?
కనీస వసతుల కల్పనలో జైలు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రొఫెసర్ సాయిబాబా జైలులోనే నిరాహారదీక్షకు సిద్దమయ్యారు. దీంతో మహారాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ, సాయిబాబాతో చర్చలు జరిపారు. ఆయన డిమాండ్లను అంగీకరించారు. కుటుంబ సభ్యులు, లాయర్లు సాయిబాబాకు పంపిస్తున్న లేఖలను ఇక నుంచి ఆపరు.వారు పంపించే మందులను కూడా ఆపరు. అంతేకాదు కనీస వసతులు కల్పించడంతోపాటు, పోస్టులో వచ్చే లేఖలు, పుస్తకాలను కూడా అందిస్తామని జైళ్ల శాఖ డీఐజీ హామీ ఇవ్వడంతో సాయిబాబా నిరాహార దీక్షను విరమించుకున్నారు. అంటే రిమాండ్ ఖైదీలు, ఖైదీల పట్ల జైలు సిబ్బంది ఎలా వ్యవహిరిస్తున్నారో తెలియజేసే సంఘటన ఇది
. ఆయన బాగా చదువుకున్న ప్రొఫెసర్ కాబట్టి నిరాహారదీక్షకు దిగి, హక్కులు సాధించుకోవాలని ప్రయత్నించారు. ఇక సాధారణ ఖైదీల విషయంలో జైలు సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఉత్తరాలు తీసుకునే, రాసే హక్కు కూడా ఖైదీలకు కూడా ఉండదా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బ్రిటిష్ వారు కూడా ఇలా చేయలేదే..
స్వాతంత్రంకోసం పోరాటాలు చేసిన వారిని ఎందరినో బ్రిటిష్ వారు జైళ్లలో పెట్టారు. కానీ ఆనాడు జీవిత ఖైదు అనుభవించిన స్వాంత్ర్య సమరయోధులు కూడా ఇలాంటి కఠిన ఆంక్షలు ఎదుర్కోలేదు. కారాగారాల్లో పత్రికలు చదువుకున్నారు. ఇష్టమైన చేతివృత్తుల పనులు చేసుకునేందుకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. జైల్లో కూర్చునే దేశాన్ని ప్రభావితం చేసే స్థాయిలో పత్రికలకు వ్యాసాలు, పుస్తకాలు రాసిన నాయకులు మనకున్నారు. కానీ సాయిబాబా, వరవరరావు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర జైళ్ల శాఖ సిబ్బంది ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.
కాఠిన్యానికి రాజకీయ శక్తులే కారణమా?
ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావుల పట్ల మహారాష్ట్ర జైళ్ల శాఖ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఖైదీలు, రిమాండ్ ఖైదీలు కూడా మనుషులే. వారికీ కొన్ని హక్కులు ఉంటాయి. రాజ్యాంగం కల్పించిన అలాంటి హక్కులను కాలరాయడం వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు రాకమానవు. అదే నిజమైతే దేశంలో మానవహక్కుల హననం జరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.











