రాష్ట్రంలో కరోనా నివారణపై సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అరగంటలో ర్యాపిడ్ పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం ఇంట్లో మంగళవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా రోగులకు అరగంటలో బెడ్ కేటాయించాలని సీఎం ఆదేశించారు. అర గంటలో ర్యాపిడ్ టెస్టు ఫలితాలు, 24 గంటల్లో అన్ని రకాలు టెస్టులు ఫలితాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
వారంలో అన్నీ వైద్య ఆరోగ్యశాఖ పోస్టుల భర్తీ పూర్తి చేయాలి
వారం రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులతోపాటు, అవసరమైన అన్ని రకాల సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ ఏపీలో పది వేలకు తగ్గకుండా కరోనా కేసులు రావడంతో సీఎం సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో 5 లక్షల 17వేల కేసులు నమోదయ్యాయి. దీనిపై సీరియస్ గా తీసుకున్న సీఎం, రాబోయే కొద్ది రోజుల్లో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కరోనా టెస్టులు తప్పనిసరి చేయనున్నారా?
ఏపీలో కరోనా లక్షణాలు ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముందుగా సామాజిక పింఛన్లు తీసుకునే వారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా గత వారం నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వృద్ధులకు భారీగా కరోనా టెస్టులు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ర్యాండమ్ గా కరోనా టెస్టులు నిర్వహించాలని యోచిస్తున్నారు. 20వ తేదీ నుంచి 9,10, ఇంటర్, డిగ్రీ, యూనివర్శిటీ విద్యార్ధులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా టెస్టులు పెద్ద ఎత్తున చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.