మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను దేవదూతతో పోల్చారు. ఇది చదివి నిజంగానే చిదంబరం కేంద్రాన్ని మెచ్చుకున్నురా? అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. వ్యంగ్యంగా ఆమెపై పలు ప్రశ్నలు సంధించారు. ఇటీవలే నిర్మలా సీతారామన్ కరోనా అనేది ‘దేవుడి చర్య’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులకు గురయిందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ పరిహారం అందించలేకపోయామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మరో కీలకమైన సూచన చేశారు. ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె సూచించారు. ఈ అంశంపై స్పందించిన చిదంబరం కేంద్ర విధానాలను తప్పుపట్టారు.
ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచిండమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలా చేస్తే రాష్ట్రాలు అప్పుల ఊబిలో కురుకుపోతాయని హెచ్చరించారు. 3 లక్షల కోట్ల జీఎస్టీ బకాయులు చెల్లించవలసిన కేంద్రం మార్కెట్ బారోయింగ్ విధానాన్ని ప్రోత్సహించడం అర్థరహితమని ఆయన జోస్యం చెప్పారు. ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్రాలకు సరైన రీతిలో న్యాయం చేయాలని సూచించారు. రాష్ట్రాల ఆర్థిక భారాన్ని కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . దేవుడి చర్యతో కేంద్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం దేవుడి చర్య అంటూ ఆమె పేర్కొనడంపై ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి ఏమైనా దైవదూతా? అని ఆయన ప్రశ్నించారు.
దేవదూత చెప్పినట్లు ఈ సంవత్సరం దేవుడి చర్య వల్లే దెబ్బతిందని అనుకుంటే మరి 2017-18, 2018-2019, 2019-2020 సంవత్సరాలలో కూడా దారుణంగా ఉన్న పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందే చెప్పాలని అడిగారు. చేతగాని విధానాలతో ఆర్థిక వ్యవస్థను భ్రస్టు పట్టించిన బీజేపీ ప్రభుత్వం దేవుడిని కారణంగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాన్ని అందించేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.











