ఏపీ ప్రభుత్వం దశల వారీగా మద్యాన్ని నిషేదించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం వ్యాపారులు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపాలని అధికారులను జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన ఎస్ఐ గోపినాథ్ రెడ్డి చూపిన ధైర్యసాహసాలు అసమానమని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం సరఫరా అవుతుందని సమాచారం అందుకున్న ఆయన పోలీసు సిబ్బందితో కలిసి సోదాలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 11:45 గంటల సమయంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఓ కారు రావడాన్ని ఆయన గమనించారు.
ఆ కారును పోలీసులు ఆపినా ఆగకుండా దూసుకురావడంతో ఎస్ఐ దానికి అడ్డుగా నిలిచారు. అధికారులను భయపెట్టడానికి ఆ కారు డ్రైవర్ ప్రయత్నించినా భయపడకుండా ఎస్ఐ ఆ కారుకు దారి ఇవ్వలేదు. తనపైకి కారు దూసుకువస్తుందని గ్రహించిన ఎస్ఐ దానిపైకి దూకాడు. కారు రూఫ్ ను పట్టుకున్న ఆయన వేలాడుతూ దాదాపు 2 కిలోమీటర్లు వెళ్ళాడు. అప్పటికే కారు అద్దాలు పగిలిపోవడంతో బాటు ఎస్ఐ అడ్డుగా ఉండటంతో కారును ఆపి డ్రైవర్ పారిపోయాడు. ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయి. సిసిటివి కెమెరాలో ఈ సంఘటనకు సంబందించిన విజువల్స్ రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎక్సైజ్ చట్టం ప్రకారం 307, 353 సెక్షన్ల కింద హత్యాయత్నం, మద్యం అక్రమ రవాణా కేసులో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పులూరి నాగేశ్వర రెడ్డిగా గుర్తించారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఎస్ఐపై పోలీస్ శాఖతో బాటు రాష్ట్ర ప్రజలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఐ భాస్కరరెడ్డి ” ఎస్ఐ చూపిన ధైర్యసాహసాలకు అభినందనలు. ఎస్ఐ చూపిన ధైర్యసాహసాలపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ ఎస్పీ అన్బురాజన్ ప్రశంసాపత్రాన్ని పంపారు. నగదు బహుమతిని కూడా పరిశీలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు. కేసును విచారణ చేస్తున్నామని” తెలిపారు.