ఇప్పటి జెనరేషన్ ప్రేక్షకుల్ని మెప్పించాలంటే… సమ్ థింగ్ స్పెషల్ అనిపించే స్థాయిలో సినిమాలో ఏదో ఒకటి ఉండాలి. ఆ ప్రత్యేకతలు ప్రచారంలో భాగం కావాలి. సినిమా విడులయ్యాక నిజంగా అవే జనాన్ని ఇంప్రెస్ చేయాలి. ఈ నేపథ్యంలో త్వరలో కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అవన్నీ ఏదో ఒక విషయంలో ఎక్స్ క్లూజివ్ నెస్ కలిగి ఉన్నాయి. వివిధ జోనర్స్ లో ఆ సినిమాలు రూపొందాయి.
విలు విద్య మీద మొట్టమొదటి సినిమా
‘అశ్వథ్థామ’ మంచి సక్సెస్ సాధించడంతో.. యంగ్ హీరో నాగశౌర్య మరింత ఉత్సాహంగా తదుపరి చిత్రాల్ని ఎంపికచేసుకుంటున్నాడు. ఆ క్రమంలో విభిన్నమైన కథా చిత్రాలపై మొగ్గు చూపిస్తున్నాడు. అతడి 20వ సినిమా కు ఒక ఎక్స్ క్లూజివ్ సబ్జెక్ట్ సరిగ్గా సెట్ అయింది. సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు కానీ.. సినిమా అంతా ప్రాచీన విలు విద్య మీద సాగుతుందట. అంటే విల్లు విద్యమీద మొట్ట మొదటి సారిగా తెరకెక్కనున్న భారతీయ సినిమా ఇదే కానుందన్నమాట. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రకోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేస్తున్నాడు. కేతిక శర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… సెప్టెంబర్ 18 నుంచి నిరంతరాయంగా షూటింగ్ జరుపుకోనుంది.
తెలుగులో మొట్టమొదటి జాంబీ మూవీ
ఇప్పటివరకూ దెయ్యాలు, డ్రాకులాలే ప్రేక్షకుల్ని భయపెట్టాయి. అంతకు మించిన స్థాయిలో భయపెట్టే జాంబీ మూవీస్ ను ఇంతవరకూ రూపొందించలేదు మన టాలీవుడ్ దర్శకులు. ఇప్పుడు అలాంటి సినిమాలకు సమయం ఆసన్నమైంది. అ, కల్కిలాంటి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ .. ఇప్పుడు ‘జాంబి రెడ్డి’ అనే హారర్ మూవీని తీస్తున్నాడు. బాలనటుడు గా అలరించిన తేజ సజ్జా ఇందులో హీరో. కరోనా వైరస్ తో .. జాంబీ కథాంశాన్ని లింక్ చేసి ఈ సినిమాను వైవిధ్యభరితంగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ .
సింగిల్ షాట్ లోనే పూర్తి సినిమా
యంగ్ హీరో తనీష్ సక్సెస్ సాధించి చాలా కాలం అయిపోయింది. ఎన్ని సినిమాల్లో నటిస్తున్నా.. అతడి కెరీర్ ను ఎవరూ గాడిలో పెట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అతడో ప్రయోగాత్మ సినిమాకి శ్రీకారంచుట్టాడు. ప్రస్తుతం ఇతగాడు చేస్తోన్న సినిమా మొత్తం సింగిల్ షాట్ లో నే ఉంటుంది. పేరు మహాప్రస్థానం. జానీ దర్వకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రిషాకా ఖన్నా కథానాయికగా నటిస్తోంది. భారతీయ తెరమీద పూర్తిగా సింగిల్ షాట్ లేనే తెరకెక్కిస్తోన్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం.
ఇండియాలోనే మొట్టమొదటి వర్చువల్ ఫిల్మ్
మలయాళ యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ హీరోగా త్వరలో ఓ సినిమా తెరకెక్క బోతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఇండియాలోనే రూపొందించబోతున్న మొట్టమొదటి వర్చువల్ మూవీ . గోకుల్ రాజ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం పాన్ ఇండియా కేటగిరిలో విడుదల కాబోతోంది. ఫిల్మ్ మేకింగ్ లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోన్న వర్చువల్ రియాలిటీ .. భారతీయ సినిమాను ఉన్నత స్థితికి తీసుకెళ్ళనుందని చెబుతున్నారు. మరి ఎక్స్ క్లూజివ్ గా వస్తోన్న ఈ సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాలి.











