ప్రభాస్ కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వుంది .. వివిధ దేశాల్లో ఆయన అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఆయన ఒక కొత్త ప్రాజెక్టు చేయనున్నాడనగానే అభిమానులందరి దృష్టి ఆ వైపు మళ్లుతుంది. అలా ఇప్పుడు అందరి దృష్టి ‘ఆది పురుష్’ పై వుంది. బాలీవుడ్ భారీ ప్రాజెక్టుగా ‘ఆది పురుష్’ రూపొందనున్నట్టు ఇటీవలే దర్శక నిర్మాతలు ప్రకటించారు. ‘రామాయణం’ కథకు దృశ్య రూపాన్ని ఇవ్వనున్నట్టు దర్శకుడు ‘ఓం రౌత్’ చెప్పాడు. ప్రభాస్ కథానాయకుడిగా నిర్మితం కానున్న ఈ సినిమాను, వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామని అన్నాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పాడు.
శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడనగానే అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. రాముడి పాత్రలో ఆయనను ఊహించుకుని కరెక్ట్ గా సెట్ అవుతాడని అనుకున్నారు. శ్రీరాముడు ధీర గంభీరుడు .. శౌర్య పరాక్రమాలకు ప్రతీక ..
ఆయన మాటకు ఎదురులేదు .. ఆయన బాణానికి తిరుగులేదు. అందువలన ఆ పాత్రలో ప్రభాస్ మెప్పిస్తాడనే నమ్మకాన్ని కనబరిచారు. మరి సీతమ్మ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారు? అనే ప్రశ్నే అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. సీతమ్మ అంటే లక్ష్మీదేవి స్వరూపం .. పవిత్రత .. ప్రశాంతత .. చెరగని చిరునవ్వు .. కరుణ కురిపించే కళ్లు ఆమెకి సహజాభరణాలు. అలాంటి ఆమె పాత్రను ‘కృతి సనన్’ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
సీతమ్మ పాత్రకి కృతి సనన్ ను ఖరారు చేయనున్నారనే వార్త వినడంతో, ప్రభాస్ అభిమానుల్లో అసహనం మొదలైంది. కృతి సనన్ అందగత్తె అయ్యుండొచ్చు .. కానీ ఆమె ఈ పాత్రకి ఎలా సెట్ అవుతుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కళ్లతోనే సీతమ్మ ఎక్కువగా మాట్లాడేదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి హావభావాలను పలికించలేని కృతిని తీసుకోవడం కరెక్ట్ కాదంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు హిందీలోగానీ .. ఇతర భాషల్లో గాని ఆమెకి గల క్రేజ్ కూడా అంతంత మాత్రమే. అందువలన ఆమె ఎంపిక విషయంలో దర్శక నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే, ప్రాజెక్టుపై అంచనాలు తగ్గుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రావణాసురుడు పాత్రలో ‘సైఫ్ అలీఖాన్’ .. . ‘లక్ష్మణుడు’ పాత్రలో సన్నీ సింగ్ .. ‘మేఘనాథుడు’ పాత్రలో అంగద్ బేడీ కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రల ఎంపిక విషయంలోను ప్రభాస్ అభిమానులు అసంతృప్తితోనే వున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే వున్నారు. ఈ పరిణామాలపై దర్శకనిర్మాతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితం కానున్న ఈ సినిమా అంచనాలు పెంచుతూ వెళ్లాలి. కానీ ఆదిలోనే అసంతృప్తిని పెంచుతూ వెళ్లడం విచారకరం.











