తెలుగు తెరపై కోట శ్రీనివాసరావు తిరుగులేని విలనిజాన్ని చూపించారు. ఇక బాబూ మోహన్ కూడా నెగెటివ్ షేడ్స్ కలిగిన కొన్ని పాత్రల్లో మెప్పించారు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి కామెడీని పరుగులు తీయించారు. ఒకానొకప్పుడు రేలంగి – రమణారెడ్డి మాదిరిగా వీళ్లిద్దరూ తెరపై హాస్యాన్ని విస్తారంగా పండించారు. కోట శ్రీనివాసరావు – బాబూ మోహన్ కాంబినేషన్ ఉందంటే, ఇక ఆ సినిమా హిట్టే అని చెప్పుకునే స్థాయిలో ప్రేక్షకులను అలరించారు. ‘అన్నా అన్నా’ అంటూ అలుగుతున్నట్టుగా బాబూ మోహన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ను .. కోట డైలాగ్స్ లోని విరుపులను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ ఇద్దరూ అలనాటి ఆ జ్ఞాపకాలను ‘ఆలీతో సరదాగా’ వేదికపై ఆసక్తికరంగా ఆవిష్కరించారు.
కోట శ్రీనివాసరావు తాను సినిమాల్లో అడుగుపెట్టిన తీరును గురించి ప్రస్తావించారు.
*”నేను ఎప్పుడూ కూడా నాకు వేషం ఇవ్వండి అంటూ నా ఫొటో పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరగలేదు. ఎందుకంటే అప్పట్లో సినిమాల్లో చేయాలంటే కాస్త ఎర్రగా బుర్రగా .. పొడగరిగా ఉండాలి. నేనేమో అప్పట్లో ఇంకా నల్లగా ఉండేవాడిని. నేను వెళ్లి వేషం అడిగితే, “నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావేట్రా” అని అంటారేమోనని భయం. అలాంటి పరిస్థితుల్లోనే నాకు ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. 1978లో వచ్చిన ఆ సినిమాలోనే తెరపై నేను తొలిసారిగా కనిపించాను. ఆ తరువాత నేను ఓ ఐదారేళ్ల పాటు అసలు సినిమాలనే పట్టించుకోలేదు.
*’ప్రాణం ఖరీదు’ సినిమా క్రాంతికుమార్ గారి నిర్మాణంలో వచ్చింది. స్టేజ్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వాలని దర్శక నిర్మాతలు అనుకోవడం వలన నాకు ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో నేను చేసిన పాత్రకి ‘నూతన్ ప్రసాద్’ డబ్బింగ్ చెప్పారు. ఆరు రోజులో .. ఏడు రోజులో షూటింగులో పాల్గొన్నాను. నా వేషం అయిపోయింది .. తిరిగి వెళుతుండగా ప్రొడక్షన్ మేనేజర్ పిలిచి పారితోషికంగా నాకు 100 రూపాయలు ఇచ్చాడు. అక్కడున్న కుర్రాళ్లకి ఆ వందా ఇచ్చేసి ఏదైనా తినండి అన్నాను. దాంతో ప్రొడక్షన్ మేనేజర్ కి కోపం వచ్చింది. “ఫస్టు టైమ్ తీసుకున్న పేమెంట్ ను అలా చేస్తారా?” అంటూ క్లాస్ పీకాడు. 100 కాగితం మీరు ఇప్పుడు చూస్తున్నారేమో .. బ్యాంకు ఆఫీసర్ గా రోజుకి కొన్ని లక్షల రూపాయలు చూస్తుంటానని అన్నాను. ఆ తరువాత 1985లో చేసిన ‘వందేమాతరం’ సినిమా నుంచి నటుడిగా నా ప్రయాణం తిరుగులేకుండా కొనసాగింది. మనకి పెద్ద గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు .. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి .. ఆ రెండూ ఉన్నవాడే కోట.
*ఇండస్ట్రీలో నేను కౌంటర్లపై కౌంటర్లు వేస్తానని చెప్పుకుంటూ వుంటారు .. సరదాగానే అలా మాట్లాడతాను. ఒకసారి ఒక గమ్మత్తు జరిగింది .. అక్కినేని నాగేశ్వరరావుగారు .. నాగార్జున కలిసి నటించిన ‘ఇద్దరూ ఇద్దరే’ సినిమా విడుదలైన రోజులవి. అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి, “కోటయ్యా నీ గురించి చాలా విన్నాను .. ‘ఇద్దరూ ఇద్దరే’ సినిమాపై మీ కామెంట్ ఏమిటి?” అని అడిగారు. “ఆ .. ఏవుంది లెండి .. ‘ఇద్దరూ ఇద్దరే’ సినిమాకి వెళితే ‘నిద్దరే నిద్దర’ అన్నాను. “మీ లెవెల్ కి ఇది చాల్లేదు ఇంకో మాట చెప్పండి” అన్నారు. దాంతో “ఏం లేదండీ ఇంట్రవెల్ లో అందరూ వెళ్లిపోతున్నారు .. ఏంటయ్యా అలా సినిమా మధ్యలో వెళ్లిపోతున్నారని నేను అడిగితే, ఏవుంటామండీ వాళ్లిద్దరూ ఏవో ఫ్యామిలీ మేటర్స్ మాట్లాడుకుంటున్నారు .. మనం వినడం బాగుండదంటూ వెళ్లిపోతున్నారు” అన్నాను. “ఓర్నీ దుంపతెగా .. ” అంటూ ఆయన పెద్దగా నవ్వేశారు” అంటూ చెప్పుకొచ్చారు.











