గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలవడంతో టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆసక్తిగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం పొలింగ్ బూత్ ల వద్ద చాలా తక్కువ ఓటర్లు కనిపించారు. అయితే… ఇప్పుడిప్పుడు ఓటు వేయడానికి ఓటర్లు ముందుకు వస్తున్నారు. సినీ ప్రముఖులు విషయానికి వస్తే… ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూతులకు చేరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, హీరో విజయ్ దేవరకొండ, హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, డైరెక్టర్ క్రిష్, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, మంచు లక్ష్మి, సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇప్పటి వరకు తమ ఓటు హక్కును వారి ప్రాంతాల్లో వినియోగించుకున్నారు. అధికారులు, సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంతలా ప్రచారం చేసినా… ఓటర్లు మాత్రం ఈ ఎన్నికలను అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.
ఓ వైపు చలి, మరో వైపు కరోనా వలన ఓటర్లు ఈ ఎన్నిక పై ఆసక్తి చూపించడం లేదు అనిపిస్తుంది. అయితే… పోలింగ్ శాతం తక్కువ ఉండడం వలన ఎలాంటి ఫలితం వస్తుందో అని రాజకీయ నాయకుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. మరి… మధ్యాహ్నాం నుంచైనా ఓటింగ్ శాతం పెరుగుతుందేమో చూడాలి.