మన దేశానికే గర్వ కారణమైన నటుడు కమల్ హాసన్. ఆయన పోషించిన పాత్రలు చాలా ప్రత్యేకమైనవి. సినిమా సినిమాకు వైవిధ్యం చూపించడంలో కమల్ తర్వాతే ఎవరైనా. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఒక అనుకోని ప్రమాదం వలన మధ్యలోనే నిలిచిపోయింది. తిరిగి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇప్పుడు కమల్ ఒక సరికొత్త లుక్ తో అదరగొడుతున్నాడు. కమల్ న్యూ లుక్ ఫొటో ఒకటి సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ జీ. వెంకట్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫొటోలో కమల్‌హాసన్ తనదైన స్టైల్లో, స్టైలిష్ లుక్ తో చిరుదరహాసంతో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ లుక్ కొత్త సినిమా కోసమా లేక మరేదైనా యాడ్ కోసమా అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే ఫాన్స్ మాత్రం కమల్ కొత్త చిత్రం కోసమే ఈ విధంగా తన లుక్ ను మార్చుకున్నాడని అంటున్నారు. కమల్‌హాసన్ తన 232వ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు. సినిమా పేరు ‘ఒన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఎ ఘోస్ట్’. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది సినిమా.
ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ ను ఇటీవలే ఏవీఎమ్ స్టూడియోలో జరిగింది. ఈ సినిమాపై నవంబర్ 7వ తేదీన కమల్ పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. దీంతో లోకేశ్ కనగరాజ్ చిత్రం కోసమే కమల్‌హాసన్ ఈ కొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు. ‘ఇండియన్ 2’ సినిమా కన్నా ముందు ఈ సినిమానే రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో కమల్ ఒక వైవిధ్యమైన పాత్రలో కనపడతారని చిత్రబృందం తెలిపింది. మరి ఈ కొత్త లుక్ సినిమా కోసమా లేక మరేదైనా యాడ్ కోసమా అనే విషయం తెలియాలంటే నవంబర్ 7వ తేదీ వరకు ఆగాల్సిందే.