ఎన్నికలు జరగుతున్న వేళ మోదీ సర్కారుకు రైతు సంఘాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ధిల్లీ పరిసరాల్లో రైతులు చేస్తున్న దీక్ష 99రోజులకు చేరింది. శనివారం నాటికి వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో రైతులు భారీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కుండ్లి- మానేసర్ – పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వేను ఉదయం నుంచి సాయంత్రం వరకు దిగ్బంధించనున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రజలు ఇళ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని రైతుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనపై అంతర్జాతీయంగా కూడా పలు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో మోదీ సర్కారుపై ఒత్తిడి పెరగనుంది. మరోవైపు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్ , అసోంలో రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేయనున్నట్లు ఇప్పటికే భారతీయ కిసాన్ సంఘ్ ప్రకటించింది. తాము ఏ పార్టీకి కూడా మద్దతు తెలపడం లేదని, అయితే బీజేపీకి ఓటు వేయద్దని ప్రచారం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్బీర్ ఎస్ రాజేవాల్, స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. మార్చి 12న కోల్‌కతాలో బహిరంగ సభతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తామని వ్యాఖ్యానించారు.
బీజేపీలో టెన్షన్..
కాగా ఈ ప్రకటనపై బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే రైతుల ప్రచారం చేస్తే బీజేపీకి కచ్చితంగా నష్టం జరుగుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే రైతుల ఆందోళనకు పశ్చిమబెంగాల్ భేషరతు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు ప్రచారం చేసినా, ఏ వ్యూహం అమలు చేసినా.. టీఎంసీకి, కాంగ్రెస్-వామపక్ష కూటమికి లాభం చేకూరుతుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3వేల ఓట్లను బీజేపీకి వ్యతిరేకంగా పడేలా చేసినా… అది టీఎంసీకి, కాంగ్రెస్-వామపక్ష కూటమికి లాభం చేకూరనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ బీజేపీలో ఆందోళన మొదలైంది. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. బీజేపీ ర్యాలీలకు, సభలకు అడ్డంకులు కల్పిస్తున్న మమత బెనర్జీ సర్కారు..రైతుల ఆందోళనా కార్యక్రమాలకు ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. బెంగాల్‌లో ఓ వైపు మమతా బెనర్జీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు, తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లో పార్టీ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్న బీజేపీకి కచ్చితంగా రైతుల ఆందోళనలు ఇబ్బందికర పరిణామాలేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read ;- వ్యవసాయ చట్టాలపై ప్రజల్లోకి వెళ్లండి: మోడీ
మరో హెచ్చరిక..
కాగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. తాజాగా రైతు సంఘాలు మరికొన్ని హెచ్చరికలు జారీ చేశాయి. ఆందోళనలు చేస్తున్న రైతులపై ఆంక్షలు పెడితే తాము ఆ ఆంక్షలకు లొంగేది లేదని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. తమ ఆందోళనకు అడ్డంకులు కల్పించే ఏ చర్యనైనా తాము ప్రతిఘటిస్తామన్నారు. ప్రభుత్వం గనుక బారికేడ్లను అడ్డుపెడితే.. వాటిని పగులగొట్టి తాము ఆందోళన కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్ హెచ్చరించడంతో కేంద్ర అలర్ట్ అయింది. తమకు యుద్ధ ట్యాంకులు తమ ట్రాక్టర్లేనని, తమ ఆందోళనను అడ్డుకునే చర్యలు మానుకోవాలని సూచించారు.
Must Read ;- అంతర్జాతీయమైన రైతుల ఉద్యమం.. కేంద్రం స్పందన ఆసక్తికరం