నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించకున్నాయి. ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల కమిషన్ (UN Human Rights) చేసిన ట్వీట్‌లో పలు వ్యాఖ్యలు చేసింది. శాంతియుత మార్గంలో పరిష్కారం కనుక్కోవాలని, అన్నివర్గాల మానవ హక్కులను కాపాడడంతో పాటు ఆమోదయోగ్యమైన పరిష్కారం కొనుగొనాలని సూచించింది. ఈ విషయంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక జనవరి 26న ఢిల్లీలో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దేశ రాజధాని వచ్చే మార్గాల్లో మరిన్ని ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో రైతుల దీక్షలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని ప్రచారం కూడా జరిగింది. దీక్షలపై దేశంలో పలువురు సెలబ్రిటీలు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయగా విదేశీ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై ఇప్పటికే ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.
Alsi Read ;- నేడు దేశ వ్యాప్తంగా ‘చక్కా జామ్’
సెలబ్రిటీల మద్దతు..
ఇటీవల పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త- , స్వీడన్ బాలిక గ్రెటా థన్బర్గ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్, పోర్న్ స్టార్ మియా ఖలీఫా తదితరులు ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఉద్యమం చేస్తోన్న భారత్‌లోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేస్తూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా కూడా స్పందించారు. మనం ఎందుకు ఈ ఆందోళనపై మాట్లాడడం లేదు అని ట్వీట్ చేస్తూ..ఓ వార్తను షేర్ చేశారు. 100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న రిహన్నా ట్వీట్ ట్రెండ్ అయింది. కాగా రైతుల దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మేనకోడలు మీనా హారిస్ ప్రకటించారు. ఇలా పలువురు సెలబ్రిటీలు రైతుల దీక్షకు మద్దతు తెలిపారు.
భారతీయ సెలబ్రిటీల అభ్యంతరం
కాగా వీరి జోక్యంపై పలువురు భారతీయ సెలబ్రిటీలు అభ్యంతరం తెలిపారు. సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్‌లు మీ సలహాలు అవసరం లేదనే రీతిలో ట్వీట్ చేశారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవాలని పిలుపునివ్వడం కూడా ఇందులో భాగంగానే జరిగిందని చెబుతున్నారు. విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ఈ ట్వీట్‌లకు ఏమాత్రం కచ్చితత్వం లేదని, బాధ్యతారాహిత్యమైన, సంచలనాల కోసమే చేసిన ట్వీట్‌లుగా ప్రకటన విడుదల చేసింది. దేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు అంతర్జాతీయ మద్దతు కూడగడుతున్నాయని, కొన్ని సమూహాలు చేస్తున్న ఆందోళను భూతద్దంలో చూపే యత్నం చేస్తున్నాయని ప్రకటన విడుదల చేసింది. అలాంటి శక్తులే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశాయని, ఇలాంటి వారి ట్వీట్లతో దేశం చాలా చింతిస్తోందని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెలబ్రిటీలు ట్వీట్ చేయడంతో అవి వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చాయి. వేల సంఖ్యలో రీట్వీట్‌లూ అయ్యాయి. అయితే ఈ రీట్వీట్ లు చేసిన వారిలో ఏ దేశం వారు ఉన్నారనేది కూడా సందేహాస్పదంగానే ఉంది. ఇక తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ చేసిన ట్వీట్‌పై కేంద్రం ఎలా స్పందింస్తుందో చూడాలి.
Must Read ;- కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు