తమిళనాడు, కేరళ, పుదుశ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళలో మల్లాపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. తమిళనాడులోని 234 స్థానాలకు, కేరళ లోని 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుశ్చేరిలోని 30 స్థానాలకు, మల్లాపురం, కన్యాకుమరి లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఎన్నికల ఫలితాలు మే2న రానున్నాయి.
సమస్యాత్మక ప్రాంతాల్లో పలు విడతలు
ఇక సమస్యాత్మక ప్రాంతాలు, ఘర్షణలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసోం, పశ్చిమ బెంగాల్‌లో పలు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసోంలో మొదటి విడతో 47 స్థానాలకు మార్చి 27న, రెండో విడతలో 39స్థానాలకు ఏప్రిల్ 1న, మూడో విడతలో 40 స్థానాలకు ఏప్రిల్ 6 ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్, అసోంలతో పోల్చితే కేరళ, తమిళనాడు, పుదుశ్చేరిల్లో ఘర్షణలు తక్కువని అందుకే ఒకే విడతలో ఎన్నికలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా తెలిపారు.
Must Read ;- పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన..!
పశ్చిమబెంగాల్‌లో 8విడతల్లో..
ఇక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పశ్చిమబెంగాల్ లో 8విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 30 సీట్లకు 27 మార్చిన, రెండో దశలో 30 సీట్లకు ఏప్రిల్ 1న, మూడో దశలో 30 సీట్లకు ఏప్రిల్ 6న , నాలుగో దశలో 44 సీట్లకు ఏప్రిల్ 10, ఐదో దశలో 45 సీట్లకు ఏప్రిల్ 17, ఆరో దశలో 43సీట్లకు ఏప్రిల్ 22న, ఏడో దశలో 36సీట్లకు ఏప్రిల్ 26న, 8వ దశలో ఏప్రిల్ 29న జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7విడతల్లో (ఆరోదశ రెండుసార్లు జరిగింది. 6a,6bగా విభజించారు)జరగ్గా ఈ సారి 8విడతల్లో నిర్వహించనున్నారు. 6,7,8 విడతల్లో నిర్వహించే వాటిలో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన మాల్దా తదితర ప్రాంతాల్లోని నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే 77 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మాల్దా, పకువాహట్,బాలుర్ ఘాట్, దంగర్ హట్, కోయిలాగంజ్, బారవిత,సిలిగురితోపాటు దాదాపు 70కిపైగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరిగిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వీలైనంత ఎక్కువ విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే గరిష్టంగా ఐదో దశలో 45సీట్లలో మాత్రమే ఎన్నికలు జరుపుతోంది.
అసెంబ్లీల గడువు..
ప్రస్తుతం ఉన్న శాసనసభ పదవీ కాలం విషయానికి వస్తే అస్సాంలో మే 31మేతో ముగియనుంది. తమిళనాడులో 24మే నెలలో ముగియనుండగా పశ్చిమబెంగాల్ లో మే 30 తో ముగియనుంది. కేరళలో జూన్ 1న ముగియనుంది. పుదుశ్చేరిలో అసెంబ్లీ గడువు జూన్ 8 వరకు ఉన్నా.. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 824 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 18.6కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఇందుకోసం 2.7లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2021 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు గాను కొత్తగా 80ఏళ్లు దాటిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఆప్షనల్ సౌకర్యం కల్పించారు.
Also Read ;- మార్చి7లోపు తిరుపతి, సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్?