నెల్లూరులో భారీ వర్షాలు .. బ్రేకుల్లేని బండి మాదిరిగా పాదయాత్ర!
గత 27 రోజుల నుంచి సాగుతున్న రైతు మహాపాదయాత్ర ఉదయం నెల్లూరు పట్టణంలోని జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాలు నుంచి అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ 12 కీలోమీటర్ల మేరకు పాదయాత్రను సాగింది. అయితే ఉదయం నుంచి వర్షం కురుస్తున్న లెక్కచేయక అమరావతి రైతులు అడుగులో అడుగేస్తూ మందుకు కదిలారు. వీరిని అనుసరిస్తూ నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకపక్క జోరు వర్షం… మరోపక్క రైతులు తమ గ్రామానికి వచ్చారని ఆనందంతో జనం బంతి పూల వర్షాలు కురిపించారు. రెండు కలగల్పి చూస్తే… తెల్లటి పాల వర్షపు జల్లుల్లో పచ్చని బంతిపూలు గంథాన్ని చిలకరించి రైతులను అభిషేకించిందా! అన్నట్లు దృశ్యం ఆవిష్కృతమైంది. నెల్లూరు జాతీయ రహదారి రైతుల కోసం పసుపు పచ్చని తివాచి పరిచినట్లుగా ఉంది. వైసీపీ తప్పా .. అన్ని రాజకీయ పార్టీలు రైతు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపగా .. స్థానికంగా ఉన్న విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి యాత్రలో రైతులతో మమేకమవుతున్నారు. ఈనాడు పాదయాత్రలో విశేషమేమిటంటే రైతులపై పూల వర్షం కురిపించాలని స్థానికులు బెంగళూరు నుంచి రెండు టన్నుల పూలను తెప్పించి మరి స్వాగతం పలకడం. ఇది కాదా .. నిజమైన నిస్వార్థమైన ప్రేమాభిమానంటే అని రైతులు పులకించిపోతున్నారు.











