తెలుగు సినిమా రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్.. రెండూ రెండు కళ్లయితే మూడో కన్ను మెగాస్టార్ చిరంజీవేననాలి. చిరంజీవి అడుగు పెట్టిన మరుక్షణం తెలుగు సినిమా రంగం జెట్ స్పీడుతో దూసుకుపోయింది. ఈ మెగా అడుగుజాడలకు నేటితో 42 ఏళ్లు. ఆగస్టు 22కూ, సెప్టెంబరు 22 కూ అవినాభావ సంబంధం ఉంది. చిరంజీవి నటనకు పునాది పడింది ‘పునాదిరాళ్లు’ సినిమాతోనే. ఆ తర్వాత వచ్చిన అవకాశం ‘ప్రాణం ఖరీదు’.కానీ విడుదలైన మొదటి సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. 1978 సెప్టెంబరు 22నే ఆ సినిమా విడుదలైంది.
చిరంజీవికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
చిరంజీవి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టారు. తొలి అవకాశం రాజ్ కుమార్ అనే దర్శకుడి నుంచి వచ్చింది. కానీ అందులో ప్రధాన హీరో నరసింహరాజు. నిజానికది నలుగురిలో నారాయణ లాంటి పాత్రే. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రాణం ఖరీదు అవకాశం కూడా వచ్చింది. ఇలాంటి టైమ్ లో తనకు స్క్రీన్ నేమ్ ఎలా ఉంటుందా అని ఆలోచించారట చిరంజీవి. ఆ సమయంలో నూతన్ ప్రసాద్, ప్రసాద్ బాబు కూడా సినిమా రంగంలో నటులుగా కొనసాగుతున్నారు. చిరంజీవి పేరు అప్పుడు శివశంకర వరప్రసాద్. ఫ్రెండ్స్ అందరూ ప్రసాద్ అనే పిలిచేవారు. ఇదే పేరును సినిమాలకు వాడితే ప్రయోజనం ఏముంటుందని చిరంజీవికి అనిపించిందట. ఓసారి నిద్రలో ఆంజనేయుడు కనిపించి ‘చిరంజీవీ’ అని పిలిచినట్టు అనిపించిందట. ఈ పేరేదో బాగుంటుందని ఆయన అలా పేరు మార్చుకున్నారు.
మెరుపు వేగమే మెగాస్టార్ ను చేసింది
సినిమా రంగంలో ఎన్టీఆర్, ఏయన్నార్ అగ్రహీరోలుగా కొనసాగుతున్నా వారు వయసులో పెద్దవారై పోయారు. అప్పటి దాకా స్టెప్పులు అంటే నాగేశ్వరరావు పేరే అందరికీ గుర్తొచ్చేది. అంతకన్నా వేగంగా స్టెప్స్ వేయగలిగే వారుంటే ఇక తిరుగేముంటుంది. చిరంజీవి దాని మీదే శ్రద్ధపెట్టారు. పాటలు, ఫైట్స్ లో చిరంజీవి చూపించిన వేగం అందరి దృష్టిలోనూ పడింది. మనవూరి పాండవులు, ఐ లవ్ యూ, ఇది కాథకాదు, నకిలీ మనిషి లాంటి ఎన్నో చిత్రాలు వచ్చాయి. అన్ని చిత్రాల్లోనూ ఆ వేగం ఏమీ తగ్గలేదు. నకిలీ మనిషిలో బైక్ తో ఆయన దూకుడు చూసి జనం ఈలలే ఈలలు. ఆ తర్వాత ‘ఖైదీ’ చిత్రంతో చిరంజీవి స్టామినా ఏమిటో రుజువైంది.
తెలుగు సినిమాకి మరో స్టార్ హీరో వచ్చేశాడు అని అందరూ భావించేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.. ఈ ఐదు పేర్లూ స్టార్ హీరో ల జాబితాలో ఉండేవి. ఇక నంబర్ వన్ స్టానంలో అక్కినేని, ఎన్టీఆర్ అటూ ఇటూ అవుతూ వచ్చినా నందమూరి తారక రామారావు తారాపథంలోకి దూసుకుపోయారు. ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల వైపు మళ్లడంతోనే చిరంజీవి ఆ స్థానాన్ని ఆక్రమించేశారు. అప్పటికీ ఇప్పటికీ ఆ మెగా ప్రభ అలానే ఉంది. ఈ ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఆయన 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ దశలో ఉంది. మరికొన్ని చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి.
చిరంజీవి ఏమంటున్నారు?
ఈ 42 ఏళ్ల సినీ ప్రయాణంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. `నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యం ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆగస్ట్ 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబర్ 22 నటుడిగా `ప్రాణం (ఖరీదు)` పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన అభిమానులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను` అని చిరంజీవి పేర్కొన్నారు.











