వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని అక్రమాలకు తెగబడిన ఒక్కో నేత అరెస్టవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణిని..బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించి ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడ్డారని నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణి A-4గా ఉన్నారు.
బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కాకాణిని నెల్లూరుకు తీసుకొచ్చారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు పలుమార్లు నోటీసులిచ్చారు. కానీ కాకాణి నోటీసులకు స్పందించలేదు. కేసులో నిందితుడిగా చేర్చిన తర్వాత మొదటి రెండు, మూడు రోజులు బీరాలు పలికారు. ఐతే అరెస్టు తప్పదని గ్రహించి పరారయ్యారు. అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఐతే అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
కేసు నేపథ్యం ఇది –
చెన్నైలో నివసించే విద్యాకిరణ్‌కు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట తవ్వకాలకు అనుమతి ఉండేది. దాని లీజు గడువు ముగియడంతో ఆయన రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చేసరికి క్వార్ట్జ్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఆ పార్టీ ముఖ్య నాయకుల కన్ను దానిపై పడింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహకారంతో వైసీపీ నాయకులు.. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు చేపట్టి క్వార్ట్జ్‌ను తరలించేశారు. ఈ ప్రాంతమంతా కాకాణి స్వగ్రామమైన తోడేరుకు సమీపంలో ఉండటం, ఆయన అండదండలతోనే ఈ అక్రమ దందా సాగుతుండటంతో ఉన్నతాధికారులెవరూ పట్టించుకోలేదు. అక్రమ తవ్వకాల కోసం నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారని, తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికంగా నివసించే గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాకాణి అండ్ కో తీవ్రంగా బెదిరించటంతో వారు మౌనంగా ఉండిపోయారు.
ఎదురుతిరిగితే దాడులు
అక్రమ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే, అప్పట్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దీక్ష చేపట్టారు. కాకాణి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు.. హిజ్రాలు, రౌడీలను ఆయనపైకి ఉసిగొల్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ అక్రమ తవ్వకాలపై కలెక్టర్, ఎస్పీ మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వరకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో..గత సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు గనులు, రెవెన్యూ శాఖాధికారులు తనిఖీలు చేసి సుమారు 61,313 టన్నుల క్వార్ట్జ్‌ను అక్రమంగా తవ్వేసి తరలించినట్లు తేల్చారు. సీనరేజీ ఛార్జీలతో పాటు పదింతల జరిమానా కలిపి మొత్తం రూ.7.56 కోట్లు చెల్లించాలని షోకాజ్ నోటీసులిచ్చారు. దానికి బాధ్యులు స్పందించలేదు. దీంతో గనుల శాఖ డీడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, వైసీపీ నేతలు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులరెడ్డిలను తొలుత నిందితులుగా చేర్చారు. దర్యాప్తులో ఈ అక్రమ తవ్వకాలన్నీ కాకాణి గోవర్ధన్‌రెడ్డే చేయించినట్లు తేలటంతో ఆయన్ను A-4గా చేర్చారు.
నోటీసులు ఇచ్చేసరికే పరారీ
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చేందుకు పోలీసులు మార్చి 30న కాకాణి నివాసానికి వెళ్లగా అక్కడ అందుబాటులో లేరు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అతికించి వచ్చేశారు. ఆ నోటీసుల్లో ఆదేశించిన మేరకు మార్చి 31న ఆయన విచారణకు హాజరుకాలేదు. తర్వాత కాకాణి హైదరాబాద్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లినా దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. ఆ తర్వాత కూడా మరో రెండుసార్లు నోటీసులిచ్చేందుకు పోలీసులు యత్నించినా కాకాణి ఆచూకీ దొరకలేదు. పరారైన కాకాణి పోలీసులకు ఆచూకీ తెలియకుండా ఉండేందుకు రెండు రోజులకోసారి స్థావరాలు మారుస్తూ వచ్చారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌లోని పలుచోట్ల తలదాచుకున్నారు. ఎక్కువ రోజుల పాటు రిసార్టులు, ఫామ్‌హౌస్‌ల్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో.. ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేస్తారని భావించి బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులోని రిసార్ట్స్‌లో దాక్కొన్నారు. అయినా జాడ పసిగట్టిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం అడ్డూఅదూపూ లేకుండా చెలరేగిపోయారు. అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకాణిపై ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కాకాణి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. వాటిపై కేసులు నమోదు చేసి విచారణలు, దర్యాప్తులను పోలీసులు ముమ్మరం చేశారు. దీంతో ప్రభుత్వంపై గోవర్ధన్‌రెడ్డి ఎదురుదాడికి దిగారు. కేసులకు భయపడేది లేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులు ఇంతకు 100 రెట్లు మూల్యం చెల్లించుకుంటారంటూ హెచ్చరించారు. క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసులో తనను నిందితుడిగా చేర్చారని తెలిశాక ఆయన ఇంటి దగ్గర జనాలను పెట్టుకుని గొడవలకు దిగే ప్రయత్నం చేశారు.











