ఏపీలో రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటికే 5 రక్షణ కారిడార్లను గుర్తించినట్లు ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయంలో సైనికులు, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రక్షణ పరికరాలు దేశానికి గర్వ కారణంగా నిలిచాయన్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ రక్షణ ఉత్పత్తుల్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే జగ్గయ్యపేట – దొనకొండ హబ్ – 6 వేల ఎకరాలు, లేపాక్షి – మడకశిర హబ్ – 10 వేల ఎకరాలు, విశాఖ – అనకాపల్లి హబ్ – 3 వేల ఎకరాలు, కర్నూలు – ఓర్వకల్లు – 4 వేల ఎకరాలను రక్షణ కారిడార్లుగా గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇక తిరుపతిని రక్షణ పరిశోధన, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామని చెప్పారు లోకేష్. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఈ కారిడార్లు దేశ రక్షణ, ఏరోస్పేస్ సామర్థ్యాల్ని బలోపేతం చేస్తాయి. ప్రజలకు ఉద్యోగావకాశాలు పెంచుతాయన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఆయా జిల్లాల్లో పరిస్థితులు, ఉపాధి అవకాశాలకనుగుణంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రధానంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.










