మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి, సీనియర్ నాయకుడు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి పోలీసులకు లొంగిపోతున్నారంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ కేంద్ర కమిటీ కొట్టివేసింది. పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో మీడియాకు శుక్రవారం నాడు రెండు పేజీల లేఖను విడుదల చేశారు. గడచిన నాలుగు రోజులుగా గణపతి లొంగిపోతున్నారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కొన్ని మీడియా సంస్థలైతే పార్టీలో సీనియర్ నాయకులు కూడా లొంగుబాటలో ఉన్నారంటూ కథనాలిచ్చాయి.
అయితే, ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలేనని, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ ఇంటెలిజెన్సీ వర్గాలు అల్లుతున్న కట్టు కథలేనంటూ అభయ్ ఆ లేఖలో పేర్నొన్నారు. “మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి లొంగిపోతున్నారంటూ వచ్చిన వార్తలన్నీ కట్టుకథలే. ఆయన ఆరోగ్యం బాగోలేదు. అంతే తప్ప ఆయన పోలీసులకు లొంగిపోతున్నారది అవాస్తవం“ అని అభయ్ తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నాటకాలతో ప్రజలను మోసం చేయలేవని, వాస్తవాలు ప్రజలకు తెలుసునని అభయ్ పేర్కొన్నారు.
గణపతి ఎక్కడ….
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న గణపతి ఎక్కడున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆయన చికిత్స కోసం ఫిలిఫైన్స్ వెళ్లారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న దండకారణ్యంలోనే గణపతి ఉన్నారని, అక్కడే మెరుగైన చికిత్స చేయించుకుంటున్నారని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గణపతి తాను రెండుసార్లు చైనా, ఒకసారి రష్యా వెళ్లానని చెప్పారు. ఇది అప్పట్లో సంచలనమైంది. ఎంతో పటిష్టమైన భద్రత ఉన్న విమానాశ్రయాల నుంచి గణపతి విదేశాలకు ఎలా వెళ్లగలిగారని పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే ఇదే ప్రశ్నను ఇంటర్వ్యూ సందర్భంగా అడిగిన జర్నలిస్టుకు “మా ఏర్పాట్లు మాకుంటాయి “ అంటూ గణపతి నవ్వేశారు. ఇప్పుడు కూడా గణపతి ఫిలిఫైన్స్ వెళ్లారనే దానికి ఆధారాలు లేకపోయినా… అనుమానాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.
గణపతే స్వయంగా స్పందిస్తారా…
తన లొంగుబాటుపై ముందుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పందించినా… ఒకటి రెండు రోజుల్లో గణపతే స్వయంగా ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు. పోలీసులు, ఇంటెలిజెన్సీ వర్గాల చేస్తున్న ప్రచారానికి తాను నేరుగా ప్రకటన చేసి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది గణపతి యోచనగా చెబుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో రెండు పేజీల లేఖ విడుదల చేసినా… పోలీసులు, మీడియా నుంచి ఇంకా తాను, ఇతర నాయకులు లొంగుబాటు వార్తలు వస్తే మాత్రం నేరుగా గణపతే స్పందించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలా స్వయం ప్రకటన ద్వారా మావోయిస్టు పార్టీశ్రేణులకు కూడా మనోబలం ఇచ్చినట్లుగా ఉంటుందనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. పార్టీలో నాలుగు దశాబ్దాలుగా అన్ని స్ధాయిల్లోనూ పని చేసిన గణపతి లొంగిపోతే పార్టీపై నమ్మకం తగ్గుతుందనే వాదనలు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని గణపతే స్వయంగా ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.











