“ వీలున్నని ఎక్కువ రోజులు శాసనసభా వర్షాకాల సమావేశాలు నిర్వహిద్దాం. దేనికీ వెరవవద్దు” ఇవీ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంత్రులు, విప్ లను ఉద్దేశించి అన్నమాటలు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంత్రులు, విప్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాల్లో అన్ని అంశాలపైనా సుదీర్ఘ చర్చ జరగాలని, ఏ ఒక్క అంశంపైనా ప్రభుత్వం వెనక్కి వెళ్లిందనే మాట రాకూడదని సీఎం అన్నారు. మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కేసీఆర్ వారితో అన్నారు. కరోనా అంశంతో పాటు ఇతర అంశాలపై ప్రతిపక్షం ఇబ్బందులు కలిగించాలి చూస్తుందని, మంత్రులు ఇచ్చే సమాధానంతో వారు మారు మాట్లాడకూడదని సీం కే.చంద్రశేఖర రావు అన్నారు. ఈ సమావేశాల్లోనే మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీ.వీ.నర్శింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానం చేయాలని, దాన్ని కేంద్రానికి పంపాలని కూడా ఆయన తెలిపారు. “మన ముద్దుబిడ్డ పీవీకి భారతరత్న కోసం తీర్మానం చేసి ఊరుకోకూడదు. దానిపై కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించాలి “ అని ఆయన స్పష్టం చేశారు.
7న శాసనసభా పక్షం సమావేశం
ఈ నెల 7 వ తేదీన తెలంగాణా రాష్ట్ర సమితి శాసనసభా పక్షం సమావేశం నిర్వహించాలని, శాసనసభలో ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలనే అంశంపై ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాలని కూడా సీఎం అన్నారు. కీలక అంశాల సమయంలో శాసనసభ నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత విప్ లదే నని, ఈ విషయం ఎమ్మెల్యేలకు ముందే చెప్పాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్నారు. ప్రతిపక్షానికి శాసనసభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇద్దామని, అధికార పక్షం గొంతు నొక్కేసిందనే మాట రాకూడదని ఆయన చెప్పారు.
7న నుంచి నగరంలో మెట్రో పరుగులు
కరోనా కారణంగా పట్టాలు ఎక్కకుండా నిలిచిపోయిన మెట్రో రైళ్లకు మోక్షం కలుగుతోంది. గడచిన ఆరు నెలలుగా నగరంలో మెట్రో రైళ్లు నడవలేదు. జంటనగరాల వాసులు కూడా కరోనాకు భయపడి బయటకు రాలేదు. ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడడంతో మెట్రో రైళ్లు నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. కేంద్రం కూడా పచ్చజెండా ఊపడంతో మెట్రో ఉన్నతాధికారులు రైళ్లు నడపడంపై ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. రైళ్లలోనే కాకుండా, మెట్రో స్టేషన్లలో కూడా భౌతిక దూరం పాటించడం, ఒక్కో బోగికి నిర్ధిష్ట పరిమితితో ప్రయాణీకులను ఎక్కించడం వంటి అంశాలపై ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెల 7 నుంచి మెట్రో రైళ్లు పరుగులు తీస్తే ప్రభుత్వం కూడా ఆర్టీసీ సిటీ బస్సులు నడిపే అంశంపై ఆలోచన చేసే అవకాశం ఉంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తూండడంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సులపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మైట్రో రైళ్లు, బస్సులు తిరిగితే నగరం మళ్లీ పాతరోజుల హడావుడిలోకి రావడం ఖాయమే.











