ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పార్టీ అధిష్ఠానం ప్రజా ప్రతినిధుల పట్ల ఒక నియంతలా వ్యవహరిస్తుందన్నది అందరూ అనే మాట. అందుకు తగ్గట్లుగా ఎన్నో ఘటనలు గతంలో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి తన సొంత ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకపోవడం, అపాయింట్మెంట్లు అసలే ఇవ్వకపోవడం లాంటివి ఎన్నో ఉన్నాయి. పైగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిర్దాక్షిణ్యంగా మార్చేస్తుండడం.. జగన్ రెడ్డి అహంకారపూరిత ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎమ్మెల్యేలకు ఏ అధికారాలు ఇవ్వకుండా, స్వతంత్రంగా వ్యవహరించే ఏ అవకాశమూ కల్పించకుండానే.. వారు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారంటూ అధిష్ఠానం నిర్ణయించేసి మార్పులు చేసేస్తోంది. దీనిపై ఎంతో మంది ఎమ్మెల్యేల్లో అసమ్మతి ఉన్నప్పటికీ.. సమయం కోసం వేచి చూస్తున్నారు.
తాజాగా పల్నాడు జిల్లాలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి చెందుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. అసలు సదరు ఎమ్మెల్సీ మాట ప్రభుత్వ అధికారుల వద్ద కూడా చెల్లుబాటు కావడం లేదని ఆయన వాపోతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా.. కనీసం ఒక రైతు సమస్యను తాను తీర్చలేకపోతున్నానని ఎమ్మెల్సీ క్రిష్ణమూర్తి మథనపడుతున్నారు. జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులకు కలిసి స్వయంగా తానే చెప్పినప్పటికీ.. తన మాటలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చాల్సిన తానే అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగడం పట్ల ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని జంగా క్రిష్ణమూర్తి స్వయంగా ట్వీట్ కూడా చేసి తన ఆవేదన పంచుకున్నారు.
పల్నాడు జిల్లాలో స్థానిక గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి, అదే జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తికి మధ్య పడడం లేదు. ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ అంతర్గత కలహాలతో తన మాట అసలు చెల్లుబాటు అవ్వడం లేదని క్రిష్ణమూర్తి చెబుతున్నారు. అధిష్ఠానం నుంచి ఫుల్ సపోర్ట్ కాసు మహేష్ రెడ్డికి ఉండడంతో తనను నియోజకవర్గంలో ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట వింటూ, తాను చెప్పిన పనులు చేయకుండా అడ్డుకుంటున్నాని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపణలు చేస్తున్నారు. ఎగువ సభకు చెందిన, అందులోనూ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధికే ప్రభుత్వ అధికారులు పనిచేయకుండా ఉంటే.. ఇక సామాన్య ప్రజల మాటేమిటనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.
గురజాల సీటును సీనియన్ లీడర్ అయిన ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి ఆశిస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ విషయంలోనే క్రిష్ణమూర్తికి.. ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య అంతర్గత కలహాలు ఉన్నట్లు సమాచారం. ఓ సందర్భంలో కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ చేయించిన సర్వే రిపోర్ట్ లో గురజాలలో మళ్ళీ ఎమ్మెల్యేగా తాను గెలిచేందుకు అవకాశాలు 61 శాతం ఉన్నాయని చెప్పుకున్నారు. పైగా హైకమాండ్ రిపోర్ట్ లో ఎక్కడా తనపై అవినీతి మరకలు లేవని కూడా మీడియా ముందు చెప్పుకున్నారు.