వేతనాలివ్వకుంటే సహాయ నిరాకరణే..
తమకు రావాల్సిన వేతనాలు చెల్లించకుంటే రేపటి నుంచి( మంగళవారం ) సహాయ నిరాకరణ చేపడతామని ఏపీ జెన్కో ఉద్యోగులు హెచ్చరించారు. జనవరి నెలకు సంబంధించిన వేతనాలను ఇప్పటి వరకు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలానే కృష్ణపట్నం ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా ఏపీ జెన్కో ఎండీ కార్యాలయాన్ని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. జనవరి నెల వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల కోసం రేపట్నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శికి ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ లేఖ రాసింది. వేతనాలు చెల్లించే వరకూ సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతోందని లేఖలో వారు స్పష్టం చేశారు.
పెడచెవిన పెట్టి సాధించేది శూన్యం!
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏపీ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు నుంచి వస్తున్న డిమాండ్స్ ను పెడచెవిన పెడితే తగిన మూల్యం చెల్లించకతప్పదు అని విద్యుత్ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 25 ఏళ్ల పాటు లీజుకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేస్తోంది. అలా కాదని.. ముందుకు అడుగులు వేస్తే దశలువారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది. అలానే మొండి వైఖరిని ప్రదర్శించి ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మెరుపు సమ్మెలోకి వెళతామని గతంలో స్పష్టం చేసింది. అందులో భాగంగానే విద్యుత్ సౌధలో ఏపీ జెన్కో ఎండీ కార్యాలయాన్ని సోమవారం విద్యుత్ ఉద్యోగుల ముట్టడించారు. తక్షణమే పోయిన నెల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ జెన్ కో ప్లాంట్ లలోని సీఈ కార్యాలయాల ముందు విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇలా గత మూడు నెలలుగా ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యుత్ ఉద్యోగులు వారి హక్కుల సాధన కోసం నినదిస్తూ రోడ్డెక్కారు. జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి మరి ఆందోళనల బాటపడుతున్నారు.











