హైదరాబాద్‌లో వర్షాలు ప్రభుత్వానికి కొత్త పాఠాలు నేర్పాయి. కాలనీలు నీట మునగడంతో యుద్దప్రాతిపదికన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకుని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు రంగంలోకి దిగింది యంత్రాంగం. ఎక్కడెక్కడ నీరు లీకేజీ అవకాశాలున్నాయో కనిపెట్టి భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా చూడాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపింది తెలంగాణ సర్కార్.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేయనున్న ఈ బృందాలకు విశేష అధికారాలు కట్టబెట్టారు. మరమ్మత్తు పనులకు గతంలో ఉన్న 20లక్షల తక్షణ సాంక్షన్ స్థానంలో 2కోట్ల వరకు నిదులను విడుదల చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఇక ముందస్తుగా నగరంలో ఉన్న చెరువు గట్లకు పూర్వవైభవం రాబోతోందని అంచనా వేస్తున్నారు నిపుణులు.
గత పది రోజులుగా కురిసిన వర్షాలతో నగరం అస్తవ్యస్త మైంది. మూడు చెరువుల కట్టలు తెగడంతో అంతులేని విషాదం నెలకొంది. ఈ మూడు చెరువుల కట్టలతోనే పదుల సంఖ్యలో కాలనీలు నీట మునగగా.. ఇతర చెరువుల నుండి వచ్చిన వరద నీటితో వందలాది కాలనీలు ముంపునకు గురయ్యాయి. వర్షాలు కురిసి పదిరోజులు కావస్తున్నా ఆ కాలనీలు తేరుకోవడం లేదు. అయితే ఇదంతా చెరువుల ఆక్రమణలతోనే జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం నగరంలో 53 చెరువు కట్టలకు పగుళ్లు ఉన్నట్టు గుర్తించామని చెబుతోంది ప్రభుత్వం.
అయితే ఈ నెల 14 న కురిసిన వర్షంలా మరో వర్షం కురిస్తే నగరం పరిస్థితి ఏమిటన్నది అందరిలోనూ గుబులు రేపుతోంది. దీంతో భారీ నష్టం వాటిల్లక ముందే ముందస్తు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇక భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టంగా చెరువుల కట్టలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ లో 15టీంలను రంగంలోకి దింపింది.
ఇరిగేషన్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు లీడ్ చేసే ఈ టీంలో 50కి పైగా సిబ్బందిని నియమించింది. ఈ బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండబోతున్నాయని.. ఏ కట్టపై ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ బృందం హెడ్‌కు సమాచారం ఇవ్వడం ద్వారా మేజర్ సమస్యలు ఉంటే… ఏకంగా రెండు కోట్ల రూపాయాలు తక్షణం మరమ్మత్తుల కోసం విడుదల చేసుకునే వెసులు బాటు కల్పించింది ప్రభుత్వం.
దీంతో ఇక గ్రేటర్ హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ మరింత పటిష్టంగా అమలు కానుంది. ముఖ్యంగా వరదల కారణంగా చెరువు గట్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజల్లో భయాంధోళనలు లేకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే నగరంలో చెరువులు ఆక్రమణలపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చేతులెత్తేసింది ఇరిగేషన్ శాఖ. కోర్టు కేసులతో పాటు కొంత ఇబ్బంది కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ముందుగా చెరువు కట్టలను పరిరక్షించుకుని ఆ తరువాత ఆక్రమణలపై ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తామంటున్నారు అధికారులు.
చెరువులకు సంబంధించిన పక్కా లెక్కలు తమ వద్ద ఉన్నాయని.. వాటిని రెవెన్యూ అధికారులతో సరిచేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే భవిష్యత్ లో చెరువులకు సంభందించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఆక్రమణలు జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామంటోంది ఇరిగేషన్ శాఖ. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అయినా గ్రేటర్ లో ప్రజలు కట్టలు తెగుతాయన్న భయం లేకుండా ఉంటారన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఈ చర్యలు ఇలానే కొసాగిస్తారా లేక కేవలం ప్రకటనలు చేసి చేతులు దులుపు కుంటారో చూడాలి.











