ఏపీలో సామాజిక పింఛన్ల కోతకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. రాష్ట్రంలో 60 లక్షల మందికి వృద్దాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. అయితే పింఛన్ల భారం పెరిగిపోవడంతో పది శాతం కోత వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా కొన్ని నిబంధనలను రూపొందించారు. పింఛనుదారుల కుటుంబంలో నాలుగుచక్రాల వాహనం ఉండటం, ఎవరో ఒకరు ఐటీ రిటర్నులు దాఖలు చేయడం, కుటుంబంలో ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేసి పింఛను పొందుతూ ఉండటం, ప్రధానంగా విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటిపోవడం వంటి నిబంధనలు తయారు చేశారు. వీటిలో ఏ ఒక్కటి వర్తించినా సామాజిక పింఛను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో 4 వేల నుంచి 5 వేల మంది తొలగించాల్సిన లబ్దిదారుల పేర్లతో లిస్టును తయారు చేశారు. ఆ లిస్టులను ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో అంటించారు. దీంతో పింఛనుదారుల్లో ఆందోళన మొదలైంది. ఇలా రాష్ట్రం మొత్తం మీద మొదటి దఫాలో 60 వేల పింఛన్లు తొలగించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే మరికొంత మంది పింఛన్ల తొలగింపునకు రంగం సిద్దం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
రూ.250 పెంపు పింఛన్ల కోతతో సరిచేస్తారా?
ప్రతి సంవత్సరం పింఛన్లను రూ.250 పెంచుకుంటూపోతామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే సంవత్సరందాటి 4 నెలలు అవుతున్నా పింఛను పెంచరా అని చాలా చోట్ల లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఎన్నికల హామీ మేరకు పింఛను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి అందిరకీ తెలిసిందే. ఒకటో తేదీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వడానికే సాధ్యకావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక పింఛన్లను పెంచడం ప్రభుత్వానికి భారంగా మారింది. అందుకే పది శాతం పింఛను పెంచాలంటే ఉన్న పింఛన్లలో పది శాతం మందికి కోత వేస్తే ఆ పథకానికి అధనంగా కేటాయింపులు లేకుండానే నడచిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అన్ని పథకాల్లో పది శాతం కోత వేస్తారా?
ఏపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ఇప్పటికే రూ.70000 కోట్లు లబ్దిదారుల ఖాతాలో వేశారు. ఇంకా మరికొన్ని కొత్త పథకాలు ఇంకా పట్టాలెక్కలేదు. వైసీపీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే కనీసం ఏటా రూ.1,20,000 కోట్లు అవసరం అవుతాయి. వీటికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు అదనం. ప్రభుత్వ ఆదాయం చూస్తే రోజు రోజుకూ తగ్గుతోంది. ఖర్చు చూస్తే బారెడు, ఆదాయం మూరెడు అన్న చందంగా తయారైంది. అందుకే కేవలం సామాజిక పింఛన్లలోనే కాదు ప్రతి పథకానికి నూతల నిబంధనలు తయారు చేసి పది శాతం కోత వేయడంతో పాటు, పన్నులు పెంచడం ద్వారా ప్రతి శాఖా పది శాతం ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందుకే కోతలు ప్రారంభించడంతోపాటు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు. రెండు, మూడు రోజుల్లో వాహనాల జీవితకాల పన్నుకూడా పెంచే విషయంపై తుది కసరత్తు జరుగుతోందని సమాచారం.
కోతలు వేయకుంటే అసలుకే మోసం
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలు కొనసాగించాలంటే సాధ్యంకాని పరిస్థితి. ఏ ఒక్క పథకం నిలిపివేసినా, ప్రజలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. నవరత్నాలు వదులుకోలేరు. వాటికి అదనంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం నడిపించడానికి రోజుకు రూ.150 కోట్లు ఖర్చవుతోంది. ఇవన్నీ తడసి మోపెడవుతున్నాయి. మరో వైపు సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు ప్రారంభించారు. ఇవన్నీ పరిశీలిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారట. ఏ పథకం కూడా తీసివేయకుండా, ఆయా పథకాలకు కొత్త నిబంధనలు రూపొందించి, పది శాతం కోత వేస్తే అన్నీ పథకాలు సజావుగా సాగుతాయని మథనం చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే లబ్దిదారులు గగ్గోలు పెట్టే ప్రమాదం ఉంది.
సంక్షేమ పథకాలే ఏపీ సంక్షోభానికి దారితీయనున్నాయా?
అప్పులు తేవడంలో ఏపీ ఇప్పటికే తన రికార్డులను తానే చెరిపివేసింది. ఎలాగోలా ఈ నెల జీతాలు చెల్లించారు. మరో రెండు పథకాలకు రూ.10000 కోట్లు అవసరం అవుతాయి. ఆ మొత్తం అప్పుపుట్టడం కష్టమే. డ్వాక్రా రుణమాఫీ మొదటి విడతకు రూ.5000 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు మరో రూ.5000 కోట్లు అవసరం అవుతాయి. వీటికి నిధులు ఎక్కడ నుంచి తేవాలా అన్ని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి కొద్ది మాసాల్లోనే ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్త ంచేస్తున్నారు.











