లియో న్యూస్ చెప్పిందే నిజమైంది. అప్పుల వేటలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు అనే కథనంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 29 వేల గ్రామ సచివాలయాల నిర్మాణ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని ది లియో న్యూస్ డాట్ కామ్ ప్రచురించిన కథనం నిజమైంది. ఇప్పటికే లక్షా 30 వేల కోట్ల బిల్లులు బకాయిలు పేరుకుపోవడంతో 29 వేల గ్రామ సచివాలయాల నిర్మాణాలు ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి. దీనిపై లియో న్యూస్ ముందే పసిగట్టింది. కేవలం గ్రామ సచివాలయాలే కాదు, 13 వేల రైతు భరోసా కేంద్రాలు, వీటికి అనుబంధంగా నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. ఏడాదిన్నర పాలనలో వైసీపీ ప్రభుత్వం లక్షా 30 వేల కోట్ల అప్పులు చేయడంతోపాటు, మరో లక్షా 30 వేల కోట్ల బిల్లుల బకాయిలు పేరుకుపోవడంపై లియో న్యూస్ ఆందోళన వ్యక్తం చేసింది. నేడు అదే నిజమని తేలింది.
రూ.200 కోట్లు కూడా ఇవ్వలేరా?
ఏపీలో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు రూ.7 వేల కోట్లు ఖర్చవుతుందని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు అంచనా వేశారు. ఈ భవనాల నిర్మాణాలను పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ భవనాల నిర్మాణాలను ఉపాధి హామీ పథకంలో చేర్చి, మెటీరియల్ కాంపౌండ్ కింద నరేగా నిధులు వాడుకోవాలని భావించారు. అయితే ఈ మధ్యకాలంలో నరేగా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.200 కోట్లు విడుదల చేస్తే పనులు కొంత మేర సాగే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది.
శ్రద్ధ చూపడం లేదనడం కన్నా ప్రభుత్వం వద్ద నిధులు లేవని తెలుస్తోంది. దీంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మరికొందరు పనులు చేయిస్తున్నట్టు నటిస్తున్నారు. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో ప్రభుత్వం చేపట్టిన భవనాల్లో కేవలం 10 శాతం అంటే 2,900 భవనాల నిర్మాణం మాత్రమే పూర్తయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.
Also Read ;- జగన్ అడిగారు.. సుప్రీం ఒప్పుకోలేదు!
నిధులివ్వకుండా ఇంజనీర్లపై ఒత్తిడా?
ఒకేసారి రూ.7 వేల కోట్లతో గ్రామసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం నరేగా నిధుల ద్వారా పనులు చేయించాలని చూస్తోందనే సమాచారం వస్తోంది. నరేగా పధకం ద్వారా కేవలం మెటీరియల్ కాంపోనెంట్ కు మాత్రమే నిధులు విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత మేర భరించాల్సి ఉంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నరేగా నిధులతోనే భవనాలు పూర్తి చేయించాలని ఇంజనీర్లపై ఒత్తిడి తేవడంతో వారు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. పనులు పడకేశాయంటూ అనంతపురం జిల్లాలో ఓ ఇంజనీర్ ను సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఇంజనీర్లను బలిచేయడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప ఈ భవనాల నిర్మాణాలు కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
త్రిశంకు స్వర్గంలో కాంట్రాక్టర్లు
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మీడియాలో వస్తోన్న అనేక కథనాలు కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పటికే నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ఇంజనీర్లు ఒత్తిడి తెస్తున్నా, పనులు మాత్రం చేయడం లేదు. ఇప్పటికే కోట్లాది రూపాయల బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతోపాటు, దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అసలు బిల్లుల బకాయిలు వస్తాయా? లేదా? అనే అనుమానాలతో కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర నిధులతో ఎలాగూ ఏపీ అభివృద్ధి పనులు జరగడం లేదు, ఇక కేంద్ర నిధులతో చేపట్టిన పనులు కూడా నిలిచిపోతే ఇక ఏపీలో ప్రభుత్వ నిర్మాణ పనులు దాదాపుగా నిలిచిపోయినట్టే చెప్పుకోవాలి.
Also Read ;- టెన్షన్ : ఆదాయం లేదు, అప్పు రాదు.. ఏపీలో రూ.లక్షా 30 వేల కోట్ల బిల్లుల పెండింగ్











