రాష్ట్ర కోర్టైనా… సుప్రీం కోర్టైనా… ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడడం రివాజుగా మారిపోయింది. రెండు కోర్టులలోని తీర్పులను కలిపి చూసుకుంటే ఇప్పటికే 100 సార్లకు పైబడే జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తాజాగా… అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని వేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. కానీ, ప్రభుత్వ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు, అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికను ఎన్నికల కమీషన్ కు సమర్పించి అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఈసీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డుపడితే మాత్రం తమను ఆశ్రయించవచ్చని మినహాయింపును ఇచ్చింది.
ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదని వాదించిన ప్రభుత్వం…
కరోనా విజృంభిస్తున్న మార్చి సమయంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టిన రాష్ట్ర ప్రభుత్వం… నేడు కోర్టులో మాత్రం ఎన్నికల నిర్వహణపై తామింకా నిర్ణయం తీసుకోలేదంటూ వాదించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలను వినిపించిన ముకుల్ రోహత్గి… తన వాదనలలో భాగంగా స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని… ఈ నేపథ్యంలో ఈసీని అనుమతి అడగాల్సిన అవసరం లేదని వాదించారు. అంతేకాదు, ప్రస్తుతం ఎటువంటి ఎన్నికల కోడ్ అమలులో లేనందున ఎన్నికల సంఘంకు రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికను అందించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ న్యాయవాది ముకుల్ వాదించారు.
దీనికి ప్రతి వాదనగా ఈసీ తరపు న్యాయవాది పరమేశ్వర్ తన వాదనలను వినిపిస్తూ… కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయని, రద్దు కాలేదని తెలియజేశారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తమ నివేదికలకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వాదించారు.
అనుమతి అనివార్యం…
ఇరు వాదనలను విన్న కోర్టు, ప్రభుత్వ న్యాయవాదిని ఉద్ధేశిస్తూ… ఈసీ ఏదైనా అభివృద్ధి పనులను చేయనివ్వకుండా అడ్డుపడిందా అని సూటి ప్రశ్నను సంధించింది. అలా అడ్డుపడనప్పుడు నివేదికను ఎన్నికల సంఘంకి అందించి అనుమతి తీసుకోవడంలో ఇబ్బంది ఉండదని పేర్కొంది. నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ, ఎన్నికల సంఘం అనుమతి నిరాకరణ చేయడం లాంటివి జరిగినపుడు మాత్రం కోర్టులో పిటీషన్ దాఖలు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి మినహాయింపును ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కోల్డ్ వార్…
రాష్ట్ర ప్రభుత్వంకి, ఎన్నికల సంఘంకి మధ్య ఈ యుద్ధం కొత్తగా మొదలైనదేమీ కాదు. మార్చిలో స్థానిక ఎన్నికలు జరిపించాలని ఎంతో పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసింది. ఈ చర్యతో ఆగ్రహంతో ఊగిపోయిన జగన్ సర్కార్, ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను తొలగించడం కూడా జరిగింది. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసి మరీ తన పదవిని తిరిగి దక్కించుకున్నారు నిమ్మగడ్డ రమేష్. తిరిగి అధికారాలను చేపట్టిన నాటి నుండి ఎన్నికల సంఘంకు ఫండ్స్ ఆపేయడం, ఏసీబీ కేసులు లాంటి చర్యలతో ఇబ్బందులకు గురిచేస్తోంది ఏపీ ప్రభుత్వం.
అంతేకాదు, స్థానిక ఎన్నికలు జరిపించడానికి ఎన్నికల సంఘం సుముఖత వ్యక్తం చేసినా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా అంటూ జాప్యం చేస్తూ వస్తోంది. నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం మార్చిలో పూర్తి కానుంది. అది పూర్తైన తర్వాత ఎన్నికలు జరిపించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తన పదవీ కాలంలోనే ఎన్నికలు నిర్వహించడానికి రమేష్ కుమార్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
మద్దతును కూడగట్టిన రమేష్ కుమార్…
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు.. రమేష్ కుమార్ కూడా పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘంకు రాష్ర్ట ప్రభుత్వం సహకరించడం లేదంటూ హైకోర్టుకెక్కింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో హైకోర్టు ఎన్నికల సంఘంకు మద్దతుగా నిలిచింది. అంతేకాదు… ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమావేశపరచి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి వారి అభిప్రాయాలను సేకరించి హైకోర్టుకు కూడా అందించింది. దానికి సంబంధించిన విచారణ కోర్టులో కొనసాగుతోంది. ఇలా ఎన్నికల సంఘంతో విభేదిస్తూ… కోర్టులలో మొట్టికాయలు వేయించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏమి సాధించాలని అనుకుంటుందో ఎవరికీ అంతుపట్టని విషయం. కనీసం ప్రతిసారి కోర్టులో ఎదురుదెబ్బలు తింటున్న ప్రభుత్వానికైనా తెలుసో లేదో?