మొదటి దానికి మొగుడు లేడు కాని కడదానికి కళ్యాణం అన్నట్లు ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీరు. విశాఖలో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సాయం కోరతామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని పదే పదే చెప్పిన కేంద్రం… నిధులు విడుదల చేయడంలో రాష్ట్రానికి మొండిచేయి చూపుతోంది. అటువంటి కేంద్రం వద్దకు వెళ్లి వాళ్లకు సంబంధం లేని ప్రాజెక్టుకు నిధుల సాయం కోరతామని చెప్పడం హాస్యాస్పదం కాక మరి ఏమిటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు కేంద్రం ఇచ్చే నిధులతో చేపట్టే పనులకు రాష్ట్రం జత చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లకే అష్టకష్టాలు పడుతూ మరో వైపు రివర్స్ టెండరింగ్ పేరిట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు హడలిపోతున్నారు. అది కాకుండా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చివేతలే తప్ప ఒక్క దాన్ని కూడా చరిత్రాత్మకంగా నిర్మించిన దాఖలాలు లేవు.
గత ప్రతిపాదనలకే దిక్కులేదు..
విశాఖ కేంద్రంగా అనేక ప్రాజెక్టులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వీఎంఆర్డీఏ నెత్తిన బాధ్యతలు పెట్టింది. ఆ ప్రాజెక్టులకే దిక్కులేదు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత లైట్ మెట్రో ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు, సవరణలు చేసింది. ఆ విషయంలో కేంద్రంతో ఎటువంటి సంప్రదింపులు చేయని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధుల కోసం మాత్రం కేంద్రాన్ని కోరతామని చెప్పడం విడ్డూరం. తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోది దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో విశాఖ పేరును ఫస్ట్ ప్రకటించారు. వాటికి సంబంధించిన నిధులే నేటి వరకు పూర్తిస్థాయిలో రాలేదు. ఇక పోలవరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేంద్రం చేసే సాయం ఎలా ఉంటుందో పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే స్పష్టంగా వివరిస్తుంది.
అతీగతీ లేని టూరిజం ప్రాజెక్టులు
అంతే కాకుండా టూరిజం శాఖకు సంబంధించిన 10 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపి నెలలు గడుస్తున్నాయి. రూ. 951 కోట్లతో చేపట్టాల్సిన ఆ ప్రాజెక్టులకు నేటికీ అతీగతీ లేదు. వీటితో పాటు అనేక ప్రాజెక్టుల్లో కేంద్రం వాటాలు సకాలంలో విడుదల కాక అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్న వైనం చూశాక కూడా బొత్స ఆ విధంగా మాట్లాడటం వెనుక కేంద్రంతో తమకు ఎంతో సఖ్యత ఉంది… తమకు పూర్తి సహకారం అందిస్తోంది… అని తిప్పితిప్పి చెప్పే ప్రయత్నం చేసినట్టు ఉంది.