తలకెక్కిన అధికార మత్తు దిగితే గానీ… రాజకీయ నాయకులకు తాము చేసిన తప్పేమిటో తెలియనట్టుంది. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పరిస్థితి చూస్తే… ఈ మాట అక్షరాల సత్యమని చెప్పవచ్చు. వైసీపీ అధికారంలో ఉండగా… రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా గుడివాడ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఇక విశాఖ జిల్లాకు చెందిన ఈ యువనేత… తనకు పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలోనూ జగన్ కీలక పాత్ర ఇస్తున్నారని… నోటికి ఎంతమాట వస్తే అంత మాట అనేసేవారు. తనను విమర్శించని వారిపైనా ఆయన విరుచుకుపడ్డ సందర్భాలు కోకొల్లలు. తన పార్టీని, ఆ పార్టీ అధినేత జగన్ ను ఎవరు ఏమన్నా కూడా గుడివాడ ఆఘమేఘాల మీద విరుచుకుపడేవారు. అలా టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా టీడీపీ కీలక నేత. మంత్రి నారా లోకేశ్ పై గుడివాడ తనదైన శైలిలో దురుసు వ్యాఖ్యలు చేశారు. ఇక జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని అయితే అమర్ నాథ్ ఓ ఆట ఆడుకున్నారు. పవన్ కల్యాణే తనతో ఫొటోలు దిగారంటూ ఆయన ఒకింత విస్మయకర వ్యాఖ్యలు కూడా చేశారు.
అయితే మొన్నటి ఎన్నికల్లో ఎంతో బలంగా కనపించిన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాను పొందేందుకు అవసరమైన సీట్లు కూడా దక్కించుకోలేక చతికిలబడింది. ఆ పార్టీ మాదిరే అమర్ నాథ్ కూడా ఘోర పరాజయం పాలయ్యారు. పార్టీ ఓడి… తాను ఓడితే గానీ గుడివాడ తలకెక్కిన మత్తు వదలలేదు. ఇలా అధికార మత్తు దిగంగానే… తాను తప్పు చేశానంటూ ఆయన ఇప్పుడు ఒప్పుకోలు బాటలోకి దిగారు. పవన్ పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఆయన ఒప్పుకున్నారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా పవన్ పై పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని కూడా ఆయన అన్నారు. ఈ విషయం నాడే తనకు అనిపించిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే తనకేమీ పవన్ పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదన్న గుడివాడ… పార్టీ లైన్ మేరకే విమర్శలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం చూపి తనను కించపరిచేలా వ్యవహరించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆయా మీడియా సంస్థలు చూపిన అత్యుత్సాహం వల్లే తాను ఇబ్బంది పడ్డానని తెలిపారు.
వైరి వర్గాలకు చెందిన నేతలపై ప్రత్యేకించి విమర్శలు గుప్పించాలని తమ పార్టీ ఏమీ తనకు చెప్పలేదని అమర్ నాథ్ తెలిపారు. పార్టీ స్టాండ్, పార్టీ అదినేత చేసే వ్యాఖ్యలను అందిపుచ్చుకుని ఆ మేరకే తాను ఓ రాజకీయ నాయకుడిగా ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేశానని ఆయన ఒప్పుకున్నారు. అలాంటప్పుడు మీ పార్టీకి చెందిన చాలా మంది మీ మాదిరిగా పరుష పదజాలంతో కూడిన విమర్శలు చేయలేదు కదా అన్న ప్రశ్నకు స్పందించిన గుడివాడ… అందరూ ఒకే మాదిరిగా ఉంటారా? అంటూ ఎదురు ప్రశ్న సంధించారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకుడినని చెప్పుకున్న అమర్ నాథ్… తాను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అభిమానిని అని చెప్పుకున్నారు. మరి పవన్ నూ అభిమానిస్తారా? అంటే… చిరు కుటుంబ సభ్యుడిగా ఉన్న పవన్ కూడా తనకు అభిమాన నటుడేనన్న భావన వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. పవన్ సినిమాలు కూడా చూస్తానని కూడా ఆయన చెప్పుకున్నారు. అయితే నేరుగా తాను పవన్ అభిమానిని అన్న విషయాన్ని మాత్రం ఆయన ఒప్పుకోలేదు. ఆ మాటను ఆయన నేరుగా చెప్పేందుకు ఇష్టపడలేదు. మొత్తంగా పవన్ పై తాను చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనన్న భావన వచ్చేలా వ్యాఖ్యానించిన గుడివాడ… రాజకీయాల్లో ఇది సహజమేనని తనను తాను జస్టిఫై చేసుకునే యత్నం చేశారు.










