ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు… తన ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే దిశగా వడివడిగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని పట్టాలెక్కించిన కూటమి సర్కారు… ఈ సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఈ లెక్కన అధికారం చేపట్టిన తొలి 6 నెలల్లోనే కూటమి సర్కారు రెండు కీలక హామీలను అమలు చేసినట్టవుతుంది.
ఇక సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైనది యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన. తాము అధికారంలోకి వస్తే… తమ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలను అందిస్తాని ఎన్నికల సందర్భంగా కూటమి హామీ ఇచ్చింది. వాస్తవానికి సూపర్ సిక్స్ లో ఈ హామీ అత్యంత కీలకమైనదిగా చెప్పాలి. ఐదేళ్లలో ఏపీ యవతకు 20 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయంటే… యువత భవితతో పాటుగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కూడా గణనీయంగా పెరిగినట్లే లెక్క.
ఇదే భావనతో సాగుతున్న కూటమి సర్కారు… 20 లక్షల ఉద్యోగాల అంశానికి ఇప్పటి నుంచే పదును పెడుతోంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఓ కీలక ప్రకటన చేశారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలను అందించడానికి తాము కృత నిశ్చయంతో ఉన్నామని ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా జాబ్ మేళాలను నిర్విహిస్తామని ఆయన చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 20న ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ జాబ్ మేళాకు బహుళ జాతి సంస్థలతో పాటు స్థానిక కంపెనీలు కూడా హాజరవుతున్నాయని ఆయన వివరించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మేళాలో ఐటీ రంగంతో పాటు ఫార్మా, స్పిన్నింగ్ రంగాలకు చెందిన ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఇదిలా ఉంటే… ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో పాట గూగల్ కంపెనీలు ఇప్పటికే విశాఖలో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఇక అనకాపల్లి పరిధిలో రెండు భారీ ుక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసేందుుకు ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాల ద్వారా ఇప్పటికే రాష్ట్ర యువతకు 50 వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్టేనని చెప్పాలి. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టినా… నిర్ణీత గడువులోనే ఈ కంపెనీలు తమ యూనిట్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
ఇక మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా ఏపీలో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతన్నాయి. ఇప్పటికే సదరు సంస్థ అమరావతికి కూతవేటు దూరంలో భూమిని కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అమరావతిలో తమకు భూములు కేటాయించాలంటూ లెక్కలేనన్ని కంపెనీల నుంచి సీఆర్డీఏకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. వెరసి ఐదేళ్లలో కూటమి సర్కారు రాష్ట్ర యువతకు 20 లక్షలకు పైగానే ఉపాధి అవకాశాలను అందించడం ఖాయమని చెప్పక తప్పదు.










