తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరగనున్న ఎన్నికల పుణ్యమా అని రాజకీయ వాతావరణం వాడి వేడిగా మారింది. గడిచిన కొన్నాళ్లుగా విపక్షం నుంచి సరైన సవాళ్లు ఎదురుకావటం లేదు. తిరుగులేని అధికారపక్షం దెబ్బకు కాంగ్రెస్.. బీజేపీలు పూర్తిగా డీయాక్టివేట్ అయినట్లుగా పరిస్థితి తయారైంది. అయితే.. అదెంత తప్పన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయ పక్షాల మధ్య వాతావరణం వేడెక్కటమే కాదు.. తెలంగాణ అధికారపక్షంలోనూ అప్రకటిత పోరు ఒకటి నడుస్తుందన్న మాట వినిపిస్తోంది.
గులాబీ బాస్ తర్వాత కారు పార్టీలో ఎవరి స్థానం ఏమిటన్న చర్చ జరిగేది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల తర్వాత కేటీఆర్ విజేతగా నిలవటం తెలిసిందే. తనది కాని టైంలో తాను స్పందిస్తే జరిగే నష్టం ఏమిటో తెలీనంత అమాయకుడేమీ కాదు హరీశ్. అందుకే.. ఆయన ఒకటి కాదు రెండు కాదు.. ఎవరూ ఊహించలేనంత వెనక్కి అడుగులు వేసినట్లుగా చెబుతారు. లోగుట్టుగా నెంబరు టూ అన్న లేని కిరీటాన్ని పెట్టుకొని తిరిగిన హరీశ్ కు.. కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలు చాలానే పాఠాలుగా మారాయని చెబుతారు.
సముద్రమంత లోతుగా అభివర్ణించే హరీశ్ ఇప్పటికైతే.. మేనమామ కమ్ గులాబీ బాస్‌కు.. టీఆర్ఎస్ పార్టీకి తానెంత విధేయుడినన్న విషయాన్ని ప్రతి సందర్భంలోనూ చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి.. హరీశ్ లాంటి స్థాయి నేతకు ఆ అవసరమే ఉండదు. కానీ.. ఆయన లెక్కలు వేరుగా చెబుతారు. తనను ఎంతలా తొక్కి పడుతున్నా.. తాను తల వంచుకున్నాననే కానీ తల ఎగిరేసేది లేదన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. అయితే.. తనకు అప్పగించిన పనిని నూటికి నూరుశాతం పూర్తి చేయటమే కాదు.. తాను మాత్రమే అంత బాగా చేయగలుగుతానన్నట్లుగా వ్యవహరించటం హరీశ్ కు ఒక అలవాటు.
అలా ఆయనకు అప్పగించిన దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఎంతలా శ్రమిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు తన వ్యక్తిగత గెలుపు అన్నట్లు హరీశ్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా అభ్యర్థికి వచ్చే మెజార్టీ మీదనే ఉంది. ఎందుకంటే.. దుబ్బాక అభ్యర్థి గెలుపునకు సంబంధించిన క్రెడిట్ మొత్తం హరీశ్ ఖాతాలోకే వెళుతుందన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కేసీఆర్ తర్వాత తానే యువరాజన్న విషయాన్ని గులాబీ పార్టీలో అందరికి అర్థమయ్యేలా చేయటమే కాదు.. పట్టాభిషేకానికి ఎప్పుడైనా రెఢీ అన్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తనకిచ్చిన టాస్కుల్ని ఎప్పటికప్పుడు విజయవంతంగా పూర్తి చేసిన కేటీఆర్.. తండ్రికి ఏ మాత్రం తీసిపోని టాలెంట్ ఆయన సొంతమన్న భావనను కలిగించటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఓవైపు దుబ్బాక ఉప ఎన్నిక.. మరోవైపు జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక.. వీటన్నింటికి మించిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు జరుగుతున్న ఎన్నికలు చూసే వారికి ఎలక్షన్లు మాదిరే కనిపిస్తాయి. కానీ.. తెర వెనుక లెక్కలు మరోలా ఉంటాయని చెబుతారు. ఈ ఎన్నికలు తెలంగాణ అధికారపక్షానికి మాత్రం మరోలా మారాయని చెప్పక తప్పదు. బావ.. బావమరిది మధ్య అధిపత్య పోరుగా కొందరు అభివర్ణిస్తున్నారు.
అటు దుబ్బాక, ఇటు జీహెచ్ఎంసీ రెండు చోట్ల కూడా గులాబీ విజయకేతనం ఎగిరే అవకాశం ఉంది. బావ బావమరిదులిద్దరూ విజేతలుగానే నిగ్గు తేలవచ్చు. అయితే సాధించే ఓట్ షేర్, విజయంలోని మోతాదు ఎవరిది ఎక్కువగా ఉంటుంది.. విజయసారథ్యంలో ఎవరు అద్వితీయులు.. అనేది నిదానంగా తేలుతుంది.











