(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
రెండున్నర శతాబ్దాలు, సుమారు 262 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి ఈ ఏడాది కరోనా అడ్డంకిగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే సుమారు మూడు లక్షల మంది భక్తులు పాల్గొనే ఒక అతి పెద్ద వేడుక.. నిస్సారంగా జరిగిపోయే అవకాశం కనిపిస్తోంది.
విజయదశమి అనంతరం..
సంప్రదాయబద్ధంగా ప్రతీ ఏడాది విజయదశమి అనంతరం వచ్చే మంగళవారం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం విజయనగరంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ రోజు అమ్మవారి చదురుగుడి నుండి పూసపాటి వంశీయుల కోట వరకు సుమారు ఒక కిలోమీటరు దూరం ప్రత్యేకంగా కర్రతో రూపొందించిన రథం (సిరిమాను)పై అమ్మవారి రూపంలో ఆలయ ప్రధానపూజారిని ప్రతిష్టింపజేసి ముమ్మారు ఊరేగిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి సుమారు మూడు లక్షల మంది హాజరవుతారు. సిరిమానుపై ఊరేగితున్న అమ్మవారిని తిలకించి, దర్శించి, తమ మొక్కులను చెల్లించి , వచ్చే యేడాది పునర్ దర్శనం కల్పించాలని వేడుకుంటారు.
రాష్ట్ర పండుగగా..
చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతున్న విజయనగరంలో సంప్రదాయబద్ధంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుండి ఈ పండగకు ముందు మూడురోజులు విజయనగరం ఉత్సవాలు పేరిట పట్టణంలో సాంస్కృతిక, సాహిత్య, కళాప్రదర్శనలు, ఫలపుష్ప ప్రదర్శనలు నిర్వహిస్తుండటం మరింత శోభను చేకూర్చుతుంది.
సంప్రదాయబద్ధంగా నిర్వహణ
పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం ఈ ఏడాది అక్టోబర్ 27న సంప్రదాయబద్ధంగా, జనరద్దీ లేకుండా పూరీ రథయాత్ర తరహాలో నిర్వహించేందుకు స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని శుక్రవారం విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, మేధావులు, పట్టణ ప్రముఖులు ప్రాథమిక అంగీకారానికి వచ్చారు. స్థానిక ప్రజలు , ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉత్సవ నిర్వహణలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలా కృతకృత్యులవుతారో వేచిచూడాలి.











