ఇతర రాష్ట్రాలనుంచి మద్యం తెచ్చుకునే విషయంలో.. జీవో లోనే పరిమితులకు లోబడి తెచ్చుకుంటే తప్పేమీ కాదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం 3 మద్యం బాటిళ్లను తీసుకురావచ్చని, ఈ జీవో అమలు చేయాలని రిట్ పిటిషన్ లో తీర్పు ఇచ్చిన ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జీవో 411 ప్రకారం మద్యం బాటిళ్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నా ఏపీ పోలీసులు, SEB అధికారులు సీజ్, అరెస్టు చేస్తున్నారని కోర్టులో రిట్ పిటిషన్ దాఖల అయింది.దీనిపై గతంలో విచారించిన ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా 3 మద్యం బాటిళ్లు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావచ్చని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది.
సర్కారుకు షాక్!
ఏపీలో జగన్ సర్కారు కొత్త మద్యం పాలసీ ద్వారా ధరలను విపరీతంగా పెంచిన తర్వాత.. ఇతర రాష్ట్రాలనుంచి మద్యం తెచ్చుకోవడం బాగా ఎక్కువైంది. పైగా ఏపీలో ధరలు ఎక్కువ కావడంతో పాటూ.. మద్యం ప్రియులకు బాగా అలవాటైన బ్రాండ్ లిక్కర్ దొరకడం తగ్గిపోయింది. కొత్త బ్రాండ్ల మద్యం ఏపీలో పరిచయం చేశారు. అవి చీప్ లిక్కర్ లాగా ఉంటున్నాయనే విమర్శలూ విపరీతంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల నుంచి లిక్కర్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది.
పరిమితంగా తమ సొంత అవసరాలకు తాగడానికి చాలా మంది ఇతర రాష్ట్రాలనుంచి అలవాటైన బ్రాండ్ మద్యం తెచ్చుకుంటున్నారు. అలాగే.. పొరుగు రాష్ట్రాలనుంచి పెద్ద మొత్తంలో లిక్కర్ తెచ్చి స్థానికంగా విక్రయించే స్మగ్లర్ల సంఖ్య కూడా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద పోలీసులు కొందరు స్మగ్లర్లతో కుమ్మక్కయి అనుమతిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ.. మరోవైపు ప్రతిరోజూ పదుల సంఖ్యలో లిక్కర్ స్మగ్లింగ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి.
అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మద్యప్రియులకు ఊరట కావొచ్చు. 3 బాటిళ్ల వరకు పొరుగురాష్ట్రాలనుంచి తెచ్చుకోవడం తప్పు కాదని కోర్టు పేర్కొంది. దీనివల్ల సర్కారు ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది. ఏపీలో మూడు బాటిళ్ల ధరకు, పొరుగురాష్ట్రంలో ధరకు ఉండగల తేడా ప్రయాణఖర్చుల కంటె ఎక్కవు అయ్యేట్లయితే… అందరూ తమకు కావాల్సిన బ్రాండ్ల కోసం పొరుగు ప్రాంతాలనుంచే తెచ్చుకోవడం అలవాటు అవుతుంది. ఆ రకంగా స్వరాష్ట్రంలో విక్రయాలు తగ్గితే.. ప్రభుత్వాదాయానికి గండిపడుతుంది.











