ఇళయ దళపతి విజయ్ తమిళ రాజకీయాల్లోకి అడుపెట్టడం ఖాయమైనట్టు తెలుస్తోంది. పార్టీ పేరును ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా పార్టీని ప్రకటించనున్నారు. విజయ్ కి తమిళ నాట మంచి క్రేజ్ ఉంది. యూత్ లో భారీగా అభిమాన సంఘాలు ఉన్నాయి. త్వరలోనే విజయ్ నటించిన మాస్టర్ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికిప్పుడు సడన్ గా విజయ్ రాజకీయ నిర్ణయం తీసుకోవడం వెనక ఎవరున్నారన్నది సస్పెన్సే. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు గతంలోనే ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.
తాను గనుక తమిళనాడు ముఖ్యమంత్రినైతే అవినీతిని తొలగించడానికే పోరాడతానని సర్కార్ సినిమా ఆడియో లాంచ్ సమయంలో ప్రకటించారు. అప్పట్లో ఆ సినిమా కూడా రాజకీయ వాసనలతోనే ఉంటుంది. నటులు కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు కొన్ని నెలల తర్వాత ఆయన ఈ తరహా ప్రకటన చేశారు. రజనీ కాంత్ రాజకీయాలకు వెనకడుగు వేయటానికీ, కమల్ హాసన్ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోడానికీ, విజయ్ రాజకీయ ప్రవేశానికీ ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
విజయ్ నటించిన మెర్సల్ సినిమాలోనూ కొంత రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయి. ‘ఒక రాష్ట్రంలో పాలించే వారు నిజాయితీగా ఉంటే ప్రభుత్వంలో దిగువ స్థాయిలో ఉన్న ఇతరులు కూడా నిజాయితీగా ఉంటారు. ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించేవారు అవినీతిపరులైతే ప్రభుత్వంలో కింది స్థాయిలో పనిచేసేవారు కూడా అవినీతిపరులవుతారు. నాయకుడు మంచి వ్యక్తి అయితే పార్టీ కూడా మంచిగానే ఉంటుంది’ అని విజయ్ సర్కార్ సినిమా సమయంలోనే పేర్కొన్నారు. అతనికి రాజకీయాలంటే ఎంత ఆసక్తి ఉందన్నది దీన్ని బట్టే అర్థమవుతోంది.
సినిమాల మాటేమిటి?
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఖైదీ లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన లోకేష్ కనకరాజ్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ లోనే ఈ సినిమా విడుదల కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది.ఇందులో విజయ్ తో పాటు విజయ్ సేతుపతి కూడా నటించారు. విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపిస్తే, విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. ఈ దీపావళికిగానీ, నవంబరు 24న గానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
లేకుంటే సంక్రాంతికి విడుదలకావచ్చు. సుధా కొంగర దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. అంతకుమించి విజయ్ ఏ సినిమాలూ అంగీకరించకపోవడం కూడా ఆయన రాజకీయ ప్రవేశంపై స్పష్టత కనిపిస్తోంది. ఆలిండిాయ దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్ పేరుతో పార్టీ పెట్టడానికి ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తమిళనాడు ఎన్నికల తేదీ కూడా సమీపిస్తోంది. ఈ కరోనా పరిస్థితుల్లో సినిమాలు చేయడం కన్నా రాజకీయాల్లోకి రావడమే ఉత్తమమని విజయ్ భావించినట్టు సమాచారం. త్వరలోనే విజయ్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఆ పార్టీతో తనకు సంబంధం లేదంటున్న విజయ్
తను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని విజయ్ అంటున్నారు. తన తండ్రి తన పేరుతో పెట్టుకునే పార్టీతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని విజయ్ పేర్కొన్నారు. విజయ్ అభిమానుల కోసం తను పెట్టిన పార్టీ ఇదని విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ అంటున్నారు. ఒక్కసారిగా విజయ్ పార్టీ వార్త గుప్పుమనడం, ఇంతలోనే ఖండనలు రావడం కొంత గందరగోళానికి దారితీసింది. ఇలా వార్తలు రావడం మీద కూడా విజయ్ సీరియస్ అవుతున్నాడు. అంటే అతను రాజకీయాల మీద అంత సీరియస్ గా లేడా అన్నాది వేచిచూడాలి.