తెలంగాణ బీజేపీలో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. కొత్త టీం కొలువు దీరడంతో పాత వర్సెస్ కొత్త లకు పొసగటం లేదంటున్నారు. దశాబ్దాల కాలంగా పార్టీలో పాతుకు పోయి, కొత్తవారికి అవకాశం కూడా ఇవ్వని వారి మాటలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈ వర్గ పోరు బయట పడినట్టు చెబుతున్నారు. ఉప ఎన్నికను కొంత మంది సీనియర్ నేతలు లైట్ తీసుకున్నారని కొత్త టీం రగిలి పోతోంది. డివిజన్ స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఏ పని చేద్దామన్న ఈ సీనియర్లు ముందటి కాళ్ళకు బంధం వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే పార్టీ ఎదుగుదల ఎలా అని కొంత మంది నేతలు , కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు..
ఇందుకు నిదర్శనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై జరిగిన దాడినే ఉదహరిస్తున్నారు. మొదటి సారి కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా పోలీసులు ఆయనపై దాడి చేశారు . అప్పుడు లోక్ సభ స్పీకర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పెద్ద నేతగా ఉన్న కిషన్ రెడ్డి ఈ విషయంలో కనీసం స్పందించ లేదు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా సంజయ్‌పై పోలీసులు మరోమారు దాడి చేశారు. పెట్రోలింగ్ వాహనంలో కుక్కి మరీ అరెస్ట్ చేసిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కేంద్ర హోం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కనీసం అప్పుడు కాని, ఇప్పుడు కాని స్పందించక పోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు సంజయ్ వర్గీయులు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కీ రోల్ మెయింటైన్ చేయలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో డీకే అరుణకు ప్రాధాన్యత పెరగడం కొందరికి రుచించడం లేదని పార్టీలో చర్చ సాగుతోంది.
కోవర్ట్ నేతలతోనే పార్టీ ఇలా తయారైందా..
రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడి నుండి డివిజన్ నేత వరకు కొత్త పాతల మధ్య గ్యాప్ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దశాబ్దాల కాలంగా పార్టీకి తామే పెద్ద దిక్కని చెప్పుకునే వారిని కాదని సంజయ్ తన సొంత మనుషులకు టీంలో అవకాశాలు కల్పించడం పట్ల వారంతా రగిలిపోతున్నారు. ఇక పార్టీ కూడా గతానికి భిన్నంగా ప్రజల్లోకి వెళ్ళడం, టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటుండటం కూడా వారికి నచ్చడం లేదంటున్నారు. కొంత మంది టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారని, గత కార్యవర్గం టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై ఉధృతంగా పోరు చేయలేక పోయారని కొందరు విమర్శిస్తున్నారు. సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొత్త టీం చేస్తున్న పోరాటానికి పాత తరం నేతలు కూడా సహకరించాలని .. లేదంటే పార్టీ ఎప్పుడూ టీఆర్ఎస్‌కి దాసోహం కాక తప్పదని హెచ్చరిస్తోంది బీజేపీ కింది స్థాయి కేడర్.










