ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఓ సాంఘిక దురాచారం క్రమక్రమంగా దక్షణాదికి ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. మిర్యాలగూడలో చోటు చేసుకున్న పరువు హత్య ఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. తన కూతురు అమృత ఓ తక్కువ కులం వ్యక్తిని వివాహం చేసుకుందని ఆమె తండ్రి మారుతీరావు అల్లుడు ప్రణయ్ ను సుఫారి ఇచ్చి హత్య చేయించారు. ఈ ఘటన మరిచిపోకముందే గచ్చిబౌలిలో మరో విషాదం చోటు చేసుకుంది. తన కూతురు హేమంత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందని కోపంతో ఆమె తండ్రి అల్లుడిని హత్య చేయించారు.
కేసు పూర్వాపరాలు
చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి ఆ జంటపై చాలా కోపంగా ఉండేవారు. దీంతో వీరిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఈ జంటను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అవంతి వారి నుంచి తప్పించుకొని క్షేమంగా బయటపడగా హేమంత్ ను మాత్రం వారు తీసుకువెళ్లారు. సంగారెడ్డి, కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. హేమంత్ హత్యపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు.. అర్ధరాత్రి కిష్టాయగూడెం వచ్చి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు.
కిష్టాయగూడెం శివారులో ఆధారాల సేకరణకు సంగారెడ్డి క్లూస్ టీమ్ వెళ్లింది. కాగా.. నిందితులు గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. పెళ్లి జరిగినప్పటి నుంచి అవంతి తండ్రి హేమంత్ పై చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ హత్య వెనుక అవంతి తండ్రి ఉన్నట్లు హేమంత్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. గచ్చిబౌలిలో కిడ్నాప్ కేసు… చందానగర్‌లో మిస్సింగ్ కేసు, సంగారెడ్డిలో హత్య కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. పంచనామా కోసం హేమంత్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.











