డ్రగ్స్ కేసు బాలీవుడ్ పునాదుల్ని కదిలించి వేస్తోంది. ఇప్పటిదాకా ఈ కేసులో చిట్టెలుకలు మాత్రమే దొరికాయి. ఇప్పుడు పందికొక్కులు సైతం పట్టుబడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఏమాత్రం లేకుంటే ఎన్సీబీ బాలీవడ్ నుంచి డ్రగ్స్ పునాదుల్ని కూకటివేళ్లతో పెకలించేలా ఉంది. తాజాగా కరణ్ జోహార్ సహాయకుడు క్షితిజ్ ఇంట్లో భారీగా డ్రగ్స్ నిల్వలు పట్టుబడినట్లు సమాచారం. ఈమధ్య కరణ్ జహార్ పార్టీ ఇవ్వడం, దానికి సంబంధించి ఎన్సీబీ ప్రోబ్స్ వీడియో వైరల్ అవ్వడం జరిగింది.
సుశాంత్ మరణం నుంచి డ్రగ్స్ వ్యవహారం మీద ఎన్సీబీ గట్టిగా దర్యాప్తు చేస్తోంది. ఈ నెల మొదట్లో శిరోమణి అకాలీదళ్ (ఎస.ఎ.డి.) నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా చాలామంది బాలీవుడ్ ప్రముఖులపై ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల్లో చాలామంది పేర్లున్నాయి. కరణ్ జొహార్ ఇచ్చిన పార్టీకి దీపికా పదుకొనే, మలైకా అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ తదితరులు హాజరయ్యారు. ఈ పార్టీలో పాల్గొన్నవారంతా డ్రగ్స్ ఉపయోగించారన్నది మంజిందర్ సింగ్ ఆరోపణ. ఎన్సీబీ తాజా దాడుల్ని బట్టి కరణ్ జొహార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు అర్ధమవుతోంది. కరణ్ తరచూ ఇలాంటి పార్టీలు నిర్వహించడం పరిపాటి. గత ఏడాది జులైలో కూడా తన ఇంటిలో ఇలాంటి పార్టీ నిర్వహించాడు.
అతను ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చాలామంది నెటిజన్లు దీన్ని డ్రగ్స్ పార్టీ అనే అన్నారు. ఇప్పటిదాకా మందు పార్టీలే జనానికి తెలుసు. డ్రగ్స్ పార్టీ అంటే చాలా ఖరీదైన పార్టీ అట. ఈ వీడియోలో వెనుక ఉన్న నిజానిజాల్ని నిగ్గుతేల్చే పనిలో ఎన్సీబీ పడింది. ఆ దిశగా దర్యాప్తు కొనసాగించింది. అందులో భాగంగానే జరిపిన దాడుల్లో గురువారం కరణ్ అనుచరుడు క్షితిజ్ ప్రసాద్ ఇంట్లో డ్రగ్స్ దొరికాయి. ఎన్సీబీ జరుపుతున్న దర్యాప్తు తీరును శంకించాల్సిన పనే లేదు. ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకోరాదని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
బుల్లితెర నటులకూ పొంచి ఉన్న ప్రమాదం
కరణ్ అనుచరుడు క్షితిజ్ ప్రసాద్ ను ఈరోజు ఎన్సీబీ విచారిస్తోంది. అతను చెప్పిన వివరాల ఆధారంగానే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కరణ్ జొహార్ బ్యానర్ ధర్మా ప్రొడక్షన్స్ లో అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంటాడు. ఈరోజు, రేపు ఇంకా మరిన్ని దాడుల్ని ఎన్సీబీ నిర్వహించే అవకాశం ఉంది. ఈరోజు తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ను కూడా విచారిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి ఈరోజు విచారణకు హాజరు కానుంది.
ఈ వ్యవహారంలో బుల్లి తెర నటుల పాత్ర కూడా ఉండటం విశేషం. అభిగెయిల్ పాండే, సనమ్ జొహార్లకు కూడా ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇరుక్కున పెద్ద చేపల్ని రక్షించే ప్రయత్నాలు ముంబయి పోలీసుల నుంచి జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రకుల్, దీపిక, సారా, శ్రద్దా కపూర్ ల విచారణ పూర్తయితే మరికొందరి పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సెలబ్రిటీలంతా ఈ వార్తల కోసమే ఎదురుచూస్తున్నారు. తమ పేర్లు ఏమైనా బయటకు వస్తాయేమోనన్న ఆందోళన చాలామందిలో ఉంది.











