మోసం చేసేందుకు భగవంతుడి పేరు వినియోగించుకునేందుకు సైతం వెనుకాడటం లేదు. సింహాచలం ప్రాంతానికి చెందిన ఓ మహిళ మరో మహిళకు పంగనామాలు పెట్టిన ఉదంతమిది. ఈ వ్యవహారంలో దేవస్థానం సిబ్బంది పాత్ర ఉందా? అన్న దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
సింహాచలం ప్రాంతానికి చెందిన హైమావతి అనే మహిళ పట్టుమని పది రూపాయలు కూడా విలువ చేయని ఒక రసీదు తో ఏకంగా రూపాయలు 1.46 కోట్లు కొట్టేసింది. నెల్లూరు ప్రాంతానికి చెందిన శ్రావణి అనే మహిళకు సింహాచలం ప్రాంతానికి చెందిన హైమావతి తో ఉన్న పరిచయాన్ని ఇందుకోసం వాడుకుంది. సింహాచలం దేవస్థానం లో బంగారం వేలం వేయబోతున్నారని, తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని హైమావతికి సూచించింది.
ఇది నమ్మిన ఆమె రెండు నెలల క్రితం సుమారు కోటిన్నర రూపాయలు సమర్పించుకుంది. అందుకు ప్రతిగా ఒక రసీదును శ్రావణికి అందజేసింది. ఆ రసీదులో బంగారం వివరాలతో పాటు గత కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ సంతకం, దేవస్థానం స్టాంపు ముద్రించి ఉన్నాయి. దీంతో నమ్మకంగా కొంతకాలం ఎదురుచూసిన శ్రావణి, బంగారం చేతికి అందకపోవడంతో సింహాచలం దేవస్థానం లో ఎంక్వైరీ చేయగా అసలు వ్యవహారం బయటపడింది. దేవస్థానంలో విక్రయించే స్క్రాప్ సైతం ఆన్లైన్లో పూర్తి పబ్లిసిటీతో విక్రయిస్తారు. అటువంటిది బంగారం లాంటి వాటిని నోటి మాటమీద ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో ఆమె ఖంగుతింది. దీనిపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటి దొంగల హస్తం ఉందా?
ఈ వ్యవహారంలో దేవస్థానం సిబ్బంది పాత్రపై ఇప్పుడు అనేక సందేహాలు రేగుతున్నాయి. ఉద్యోగుల సహకారంతోనే పక్కా ప్లాన్ తో ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ఇదే అనుమానం దేవస్థానం కొందరు అధికారుల్లో కూడా వ్యక్తమవుతోంది. రసీదును ఎక్కడ ముద్రించారు? ఈవో ఫోర్జరీ సంతకం ఎవరు చేశారు? రసీదు పై ముద్రించిన స్టాంపులు ఎక్కడినుంచి వచ్చాయి? ఇలా అనేక అంశాలపై పోలీసు విచారణలో క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా దేవుడి పేరిట దోపిడీ చేసిన ఈ వ్యవహారం సంచలనం అయింది.











