టాలీవుడ్ మోస్ట్ ఎఫిషియెంట్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ముఖ్యంగా మాస్ జనానికి ఫ్యాక్షన్ ఫీస్ట్ అందించిన దర్శకుడిగా ఆయన బాగా ఫేమస్. ఒకప్పుడు సుమోలను గాల్లోకి లేపి.. హీరోలకు హైఓల్టేజ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన వినాయక్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయాడు. ఎర్లియర్ గా వినాయక్ తీసిన ‘ఇంటెలిజెంట్’ తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన మరో సినిమా తీయలేదు. ‘శీనయ్య’గా హీరో వేషం వేస్తున్న కారణంగా ఆయన ప్రస్తుతం డైరెక్షన్ ను పక్కనపెట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆ వర్క్ జరుగుతుండగానే.. వినాయక్ ను ఇప్పుడో బంపరాఫర్ వరించిందన్న టాక్ బాగా వినిపిస్తోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాన్ని వినాయక్ చేతిలో పెట్టారట. ‘లూసిఫర్’ మలయాళ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. ఆ సినిమా బాధ్యతను యంగ్ డైరెక్టర్ సుజిత్ కు అప్పగించిన సంగతి కూడా విదితమే. అయితే సుజిత్ స్క్రిప్టు చిరంజీవికి సంతృప్తినివ్వని కారణంగా .. ఆ సినిమా దర్శకత్వం నుంచి అతడ్ని తప్పించారని.. అతడి ప్లేస్ లో చిరు వినాయక్ ను రంగంలోకి దింపారని తెలుస్తోంది.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ చిత్రం.. డబ్బింగ్ రూపంలో తెలుగులో వచ్చినా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే అదే సినిమాను చిరుతో తీస్తే బాగుంటుందని రామ్ చరణ్ భావించాడట. పొలిటికల్ థ్రిల్లర్స్ గతంలో చేయలేదు కాబట్టి.. ఆ సినిమా మీద చిరు కీ ఇంట్రెస్ట్ కలిగిందట. అయితే ఆ సినిమా అనుకున్నప్పుడే చిరంజీవికి దర్శకుడిగా వినాయక్ మదిలో మెదిలారట. కానీ అతడు శీనయ్యతో బిజీగా ఉండడంత .. సుజిత్ ను సంప్రదించాల్సి వచ్చింది. మొత్తానికి ఇప్పుడు చిరంజీవి కోరుకున్నట్టుగానే తెలుగు ‘లూసిఫర్’ కు వినాయక్ దర్శకుడిగా ఫిక్సయ్యాడని తెలుస్తోంది.
అంతేకాదు తెలుగు నేటివిటీకి అనుగుణంగా వినాయక్ తయారు చేసిన స్క్రిప్టు చిరంజీవికి బాగా నచ్చిందట.
ఇంతకు ముందు మెగాస్టార్ ‘ఠాగూర్’ సినిమా కోసం వినాయక్ చేసిన మార్పులు సినిమాకి ఎంతగా ప్లస్ అయ్యాయో తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ రమణ స్క్రీన్ ప్లే ను పూర్తిగా మార్చేశాడు వినాయక్. అలాగే. ‘ఖైదీ నెంబర్ 150’ విషయంలో కూడా వినాయక్ తీసుకున్న స్పెషల్ కేర్, చిరంజీవి ఇమేజ్ ను రెట్టింపు చేసేలా అతడు చేసిన మార్పులు ఆ సినిమాకి కూడా బాగా అడ్వాంటేజ్ అయ్యాయి అందుకే లూసిఫర్ రీమేక్ ను కూడా వినాయక్ కే అప్పగించాలని డిసైడయ్యారట చిరంజీవి.
దానికి తగ్గట్టుగానే వినాయక్ ‘లూసిఫర్’ స్క్రిప్టును లాక్ చేశాడని.. వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో సినిమా ప్రారంభం కానుందని టాక్స్ వినిపిస్తున్నాయి. కొసమెరుపేంటంటే.. ‘లూసిఫర్’ లో మోహన్ లాల్ కు హీరోయిన్ ఉండదు. కానీ తెలుగు వెర్షన్ లో మాత్రం చిరంజీవి కోసం ఒక క్రేజీ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరన్నదీ ఇంకా తెలియదు. సో.. మొత్తానికి మెగాస్టార్ కు వినాయకుడి సెంటిమెంట్ బాగానే ఉందన్నమాట.











