బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. మన బలం కన్నా ఎదుటివాడి బలాన్ని చీల్చడం ద్వారా అధికారం దక్కించుకోవచ్చని బీహార్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం, బీహార్ ఎన్నికల్లో పోటీచేసి భారీగా ఓట్లు చీల్చడం ద్వారా ఫలితాలను తారుమారు చేసింది. ముస్లింలు ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం భారీగా ఓట్లను చీల్చగలిగింది.
ముస్లిం మైనారిటీల అభిప్రాయాలకు వ్యతిరేకంగా సీఏఏ చట్టం తీసుకురావడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల్లో చివరి ఓటరు వరకూ తీసుకెళ్లగలిగారు. సీఏఏపై కాంగ్రెస పార్టీ ముఖ్యనేతలు నోరుమెదపకపోవడంపై కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ తో జతకట్టిన ఆర్జేడీ కూటమిని చిత్తుగా ఓడించాలని ఒవైసీ ఇచ్చిన పిలుపు ఫలితాలు పరిశీలిస్తే ఫలించినట్టే అనిపిస్తోంది.
బీహార్ లో సత్తా చాటిన ఎంఐఎం
బీహార్ లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. అమౌర్, కొచాధమన్, జోకిహాట్, బైసీ, బహదూర్ గంజ్ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. మరో 60 స్థానాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించి, ఆర్జేడీ ఓటమికి కారణమయ్యారు. దీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న ముస్లిం ఓట్లలో చీలిక తెచ్చేందుకు బీజేపీ నేతలు ఎంఐఎంతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన విమర్శలను కూడా కొట్టిపారేయలేం.
అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తాం.. అసదుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం పోరాటం బీహార్ ఎన్నికలతో ఆగదు. దేశంలో అన్ని ప్రధాన రాష్ట్రాల్లో తమ సత్తా చాటుకుంటామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు త్వరలో ఎన్నికలు జరగబోయే బెంగాల్ లోనూ ఎంఐఎం పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదే జరిగితే ముస్లిం ఓట్లతో బెంగాల్ రాజకీయాలను శాసిస్తున్న మమతా బెనర్జీ పాలనకు బ్రేక్ పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ లో ముస్లింల ఓట్లను చీల్చితే, లాభపడేది బీజేపీనే.
వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఇటీవల ప్రకటించారు. బెంగాల్‌లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలను పరిశీలించిన షా ఈ మాటలు చెప్పడంలో పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పని లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పేరు చెబితేనే నిప్పులు చెరిగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపును సునాయాసం చేస్తున్నారనిపిస్తోంది. ఇక బీహార్ ఫలితాలను విశ్లేషించిన బీజేపీ నేతలు ఆ ఫార్ములాను దేశవ్యాప్తం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా బీహార్ ఎన్నికల్లో చిన్న పార్టీలే పెద్ద పార్టీల ఫలితాలను శాసించాయని చెప్పవచ్చు.