ఐఏఎస్ అధికారుల బదలాయింపు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. నిన్నటిదాకా తెలంగాణలో విధులు నిర్వర్తించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, వాకాటా కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రాస్ లు గురువారం అమరావతికి వచ్చి ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వద్ద రిపోర్ట్ చేశారు. వెరసి ఐఏఎస్ ల కేడర్ వివాదం ఎట్టకేలకు ముగిసినట్టైంది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఈ నలుగురు అధికారుల్లో ఆమ్రపాలితో పాటు రోనాల్డ్ రాస్ కీలక బాధ్యతలను వదిలేసుకుని వచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ పోస్టును ఆమ్రపాలి వదిలేసుకుంటే… ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును రోనాల్డ్ రాస్ వదిలేసుకున్నారు. ఈ నలుగురు అదికారులకు ఏపీలో ఏఏ పోస్టులు దక్కనున్నాయన్న అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో జన్మించి విశాఖలో పెరిగిన ఆమ్రపాలి ఏపీకి చెందిన వారే. ఐఏఎస్ అధికారిగా తనకు దక్కిన ప్రతి పోస్టులోనూ ఆమె తన సత్తాను చూపారు. కొంతకాలం పాటు ఉమ్మడి ఏపీ కేడర్ లో పనిచేసిన ఆమ్రపాలి… ఆ తర్వాత సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఈ సమయంలో ఆమె ప్రధానమంత్రి కార్యాలయంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు.దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షించిన ఆమ్రపాలి… సత్తా కలిగిన అదికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ సర్వీసుల నుంచి ఆమెను తిరిగి హైదరాబాద్ పిలిపించిన తెలంగాణ సర్కారు… ఆమెకు కీలక పోస్టులు కట్టబెట్టింది. ఇటీవలే జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమెకు అత్యంత కీలకమైన పోస్టును కట్టబెట్టింది. ఇప్పుడు ఏపీ కేడర్ కు రావడంతో ఆమెకు ఏ పోస్టు దక్కనుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో కొత్తగా అదికారంగా చేపట్టిన కూటమి సర్కారులో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… తనకు నచ్చిన శాఖలను తీసుకున్నారు. ఆ శాఖల పర్యవేక్షణ కోసం ఆయన ఏకంగా కేరళ కేడర్ లో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజను ఏపీకి రప్పించుకున్నారు. ప్రస్తుతం పవన్ శాఖలను ఆయనే చూస్తున్నారు. తాజాగా ఏపీకి వచ్చిన ఆమ్రపాలిని కూడా పవన్ తన శాఖల పర్యవేక్షణ కోసం నియమించుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే… తెలంగాణ మాదిరే ఏపీలోనూ ఆమ్రపాలికి కీలక బాధ్యతలు దక్కినట్టే. అంతేకాకుండా పవన్ శాఖల పర్యవేక్షణ బాధ్యతలు ఆమ్రపాలి చేపడితే… నిన్నటిదాకా ఆమెకు కీలక పోస్టింగులు ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖుషీ అయ్య అవకాశాలున్నాయి.