నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ పుంజుకుంది. గతంలో మాదిరి కంటే నిమిషాల్లో నిధుల కేటాయింపు జరుగుతుంటే… ఆ వెంటనే టెండర్లను పూర్తి చేసి రోజుల వ్యవధిలోనే పనులను మొదలుపెట్టేలా టీడీపీ కూటమి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాసం కోసం ఇప్పటికే దాదాపుగా నిర్మాణాలను పూర్తి చేసుకున్న 18 టవర్లలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు చంద్రబాబు సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏకంగా రూ.524 కోట్ల నిధులను కేటాయించిన ప్రభుత్వం… రానున్న రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ వెంటనే పనులు మొదలయ్యేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రకు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు… తన తొలి టెర్మ్ లోనే కీలక నిర్మాణాలైన సచివాలయం, అసెంబ్లీ సముదాయం, హైకోర్టు వంటి వాటి నిర్మాణాలను పూర్తి చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ఇతరత్రా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగానికి అవసరమైన మేర నివాస సముదాయాల నిర్మాణాలను మొదలుపెట్టిన నాటి చంద్రబాబు సర్కారు.. వాటిలో ప్రధాన నిర్మాణాలను పూర్తి చేసింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి, వైసీపీ సర్కారు రాకతో అమరావతి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అసలు మద్యలోనే నిలిచిన నిర్మాణాలను పూర్తి చేయాలన్నదిశగానూ జగన్ సర్కారు కదలలేదు.
తాజాగా జగన్ ను అధికారం నుంచి దించేసిన రాష్ట్ర ప్రజలు మరోమారు చంద్రబాబుకే అధికారం కట్టబెట్టారు. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… ఈ టెర్మ్ లో అమరావతికి ఓ పరిపూర్ణమైన రూపును ఇవ్వాల్సిందేనన్న కసితో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా కంప చెట్లతో కీకారణ్యంలా మారిపోయిన అమరావతిని కేవలం రోజుల వ్యవధిలోనే శుభ్రంగా మార్చివేశారు. తాజాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం ప్రతిపాదించిన 18 టవర్లలో మిగిలిపోయిన పనులను తక్షణమే పూర్తి చేసేందుకు సంకల్పించారు. అందుకోసం నిధులను విడుదల చేసిన చంద్రబాబు… టెండర్ల ప్రక్రియతో పాటు పనులను పరుగులు పెట్టించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.