2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ, జనసేనతో పొత్తు కట్టి బరిలోకి దిగిన టీడీపీ… తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను అందజేస్తామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఊహించినట్లుగానే ఎన్నికల్లో టీడీపీ కూటమికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రికార్డు సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. చంద్రబాబు మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటిదాకా వైసీపీ సర్కారు అమలు చేసిన ఇసుక పాలసీని రద్దు చేసిన చంద్రబాబు… పూర్తి స్థాయి ఇసుక విధానాన్ని ప్రకటించారు. అయితే ఈ విధానం అమలులో పలు అవాంతరాలు ఎదురయ్యాయి. రాష్ట్రంలో ఇతరత్రా పరిస్థితులను చక్కదిద్దే పనిలో నిమగ్నమైన చంద్రబాబు తాజాగా బుధవారం నాటి కేబినెట్ భేటీలో ఉచిత ఇసుక విధానంలో ఎదురవుతున్న అవాంతరాలపై దృష్టి సారించారు.
ఉచిత ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించినా…మొన్నటిదాకా కూటమి పార్టీలకు చెందిన చాలా మంది నేతలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఫలితంగా ఉచిత ఇసుక దొరకడం లేదని ప్రజలు ఫిర్యాదులు చేశారు. విపక్షాలైతే ఇవే ఫిర్యాదులను ఆసరా చేసుకుని చంద్రబాబు సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. వీటన్నింటినీ పరిశీలించిన చంద్రబాబు ఉచిత ఇసుకలో కూటమి పార్టీలకు చెందిన నేతలు జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పారు. ఇకపై ఉచిత ఇసుకలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని, అలాంటి నేతలు ఏ పార్టీకి చెందిన వారైనా చర్యలు తప్పవని కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
పనిలో పనిగా ఉచిత ఇసుక విధానంపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..ఇకపై రాష్ట్ర ప్రజలకు ఉచిత ఇసుక దొరికి తీరుతుందని స్పష్టం చేశారు. సొంత నిర్మాణాల కోసం ఇసుక తీసుకునే వారి వద్ద కనీసం రవాణా చార్జీలు కూడా వసూలు చేయరాదని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ఇసుక కోసం వచ్చే వారి వద్ద ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇసుక కోసం వచ్చే కాంట్రాక్టర్ల వద్ద మాత్రం రవాణా చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, ఇసుకకు ఎలాంటి రుసుము వసూలు చేయరాదని కూడా ఆయన తేల్చి చెప్పారు. వెరసి ఇకపై రాష్ట్రంలో ఉచిత ఇసుక పక్కాగా అమలు అవుతుందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.